వివిధ ప్రాంతాలలో పర్యటించి, అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి చాలా మంది ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కారులో దూర ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటారు. నేటి ఆధునిక జీవిన విధానంలో ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఇలాంటి యాత్రలు ఎంతో ఉపయోగపడతాయి.
సాధారణంగా ఎత్తయిన ప్రదేశాలు, కొండలు, గుట్టలు, మెలికలు తిరిగే రహదారులపై ప్రయాణం చాలా బాగుంటుంది. అయితే మైదానాల్లో కారును నడపటానికి, కొండల్లో డ్రైవింగ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. కొండల్లో కారు నడిపేటప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటితో అప్రమత్తంగా ఉండకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.
లైట్లు, హారన్
కొండల్లో కారులో నడిపేటప్పుడు హారన్, హెడ్ లైట్లు తప్పనిసరిగా వినియోగించాలి. ముఖ్యంగా హెయిర్ పిన్ బెండ్, బ్లైండ్ కర్వ్ సమీపించేటప్పుడు హారన్ కొట్టాలి. దాని వల్ల ఎదురుగా వచ్చే ఇతర వాహనాలను అప్రమత్తం చేయవచ్చు. అలాగే కొండల్లో పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల దారి స్పష్టంగా కనిపించదు. ఈ సమయంలో హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు వేయడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఒత్తిడి
మీరు చిన్నకారు, లేదా పాత కారులో వెళుతున్నప్పుడు ఇంజిన్ పై ఎక్కువ ఒత్తిడి పెంచకూడదు. ఓవర్ లోడుతో ప్రయాణించడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంజిన్ నుంచి బ్యాటరీకి శక్తి వస్తుంది. కారులో బ్యాటరీ ద్వారా పనిచేసే ఉపకరణాలను వినియోగించడం వల్ల బ్యాటరీపై, చివరకు ఇంజిన్ పై ఒత్తిడి పడుతుంది. ఇలాంటి సమయంలో కారులోని ఏసీని ఆఫ్ చేయడం మంచిది.
ఓవర్ టేక్
కొండలు, ఎత్తయిన ప్రదేశాల్లో రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు ముందు వాహనాలను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల ఎదుట వచ్చే వాహనాలతో పాటు మీకు కూడా ప్రమాదం జరగొచ్చు. కొండలపై ఎత్తయిన రోడ్లకు పక్కనే లోతయిన ప్రదేశాలు ఉంటాయి. ముందు వాహనాన్ని ఓవర్ టేక్ సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా పల్లపు ప్రాంతాల్లోకి కారు బోల్తా పడే ప్రమాదం ఉంది.
గేర్ల వినియోగం
కారును డ్రైవింగ్ చేసేటప్పుడు గేర్లను సక్రమంగా వినియోగించడం చాలా అవసరం. లేకపోతే నియంత్రణ చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మొదటి గేర్ లో ఎత్తుకు వెళితే, అదే గేర్ లో పల్లపు ప్రాంతానికి రావాలి.
ఇంజిన్ బ్రేకింగ్
కొండలపై ఎత్తయిన ప్రాంతాల నుంచి కిందకు వెళ్లినప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ ఇంజిన్ బ్రేకింగ్ వినియోగించడం ఉపయోగంగా ఉంటుంది. బ్రేక్ పెడల్ వాడితే బ్రేక్ ప్యాడ్లు త్వరగా వేడెక్కుతాయి. దీని వల్ల ఒక్కోసారి బ్రేకులు పనిచేయకపోవచ్చు. ఇంజిన్ బ్రేకింగ్ వల్ల అలాంటి ఇబ్బందులు ఉండవు.
































