విద్యార్థులకు శుభవార్త.. కాస్మెటిక్ ఛార్జీలు ఇప్పుడు ఖాతాలోనే జమ అవుతాయి.

 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామ కృష్ణా రావు రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల అకౌంట్ లలో జమ చేసే విధి విధానాలపై సమీక్ష చేశారు.


దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎస్ కే. రామ కృష్ణా రావు మాట్లాడుతూ… జూన్ మాసంలో పాఠశాలలు పున:ప్రారంభమవగానే విద్యార్థుల ఆధార్, ఫోటోలను సంబంధిత బ్యాంక్ బ్రాంచీలకు అనుసంధానించి వారి బ్యాంక్ అకౌంట్ లకు డెబిట్ కార్డు మంజూరు చేయించాలని అన్నారు. జూన్ మాసాంతం నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల అకౌంట్ లలో కాస్మోటిక్ చార్జీల చెల్లింపులు జరిగే విధంగా తగు కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. దాదాపు 6 లక్షల విద్యార్ధులకు ఈ సదుపాయం అందిస్తున్న విషయాన్ని అధికారులు సీఎస్​కు వివరించారు.

ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు , ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు డిబిటి ద్వారా చెల్లింపులు జరిగే విధంగా కార్యక్రమం రూపొందించాలని అధికారులకు సూచించారు. అదే విధంగా డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించి విద్యార్థులు వారికి కావాల్సిన సబ్బులు, కాస్మోటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాల ద్వారా కోనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సి.ఎస్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాజీవ్ యువ వికాసం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ చెల్లింపులు తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఎస్ సి డెవలప్ మెంట్ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎ. వర్షిణి, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి ఈ. శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.