యాపిల్ తన ప్లాంట్లను నిర్మించడానికి భారత్‌కు వెళ్లొచ్చని, కానీ ఆ టెక్ కంపెనీ సుంకాలు లేకుండా అమెరికాలో తన ఉత్పత్తులను విక్రయించడానికి వీలుండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అణుశక్తిని పెంచడానికి ఓవల్ కార్యాలయంలో బహుళ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘టిమ్ కుక్ యాపిల్ ప్లాంట్లు నిర్మించడానికి భారతదేశానికి వెళ్తున్నానని నాతో అన్నారు. అక్కడకు వెళ్లడం ఫర్వాలేదు కానీ సుంకాలు లేకుండా ఇక్కడ ఆ ఉత్పత్తులను విక్రయించడం కుదరదని చెప్పాన’ని ట్రంప్ వెల్లడించారు. ఐఫోన్లను అమెరికాలో సుంకాలు లేకుండా విక్రయించుకోవాలంటే ఇక్కడే ఉత్పత్తి చేయాలని నేను ప్రతిపాదించానని తెలిపారు. దీనికి యాపిల్ సుముఖంగా లేకపోతే 25 శాతం సుంకాలు చెల్లించి ఇక్కడ ఉత్పత్తులను విక్రయించుకోవాల్సి ఉంటుందని వివరించారు.
భారత్‌లో చౌకగానే..: భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ మన దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో తక్కువ ఉత్పత్తి వ్యయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది.
జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం..: భారత్‌లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ ఖర్చు సుమారు 30 డాలర్లు కాగా, అమెరికాలో 390 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. భారత్‌లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. మన దేశంలో ఒక కార్మికుడికి నెల సంపాదన సగటున 230 డాలర్లు (రూ.19,000). అదే అమెరికాలో కనీస వేతన చట్టాల ప్రకారం ఈ సంపాదన 2,900 డాలర్ల (రూ.2.4 లక్షలు) వరకు ఉంటుంది. అంటే దాదాపు 13 రెట్ల వ్యత్యాసం ఉంది. అలాగే భారత ప్రభుత్వం అందించే పీఎల్‌ఐ పథకం కూడా యాపిల్‌కు అదనపు లాభాల్ని అందిస్తోంది. దీంతో ఐఫోన్లపై 25% సుంకం విధించినా భారత్‌లో చౌకగానే తయారవుతాయి.
































