జపాన్‌ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశం

భారత్ జపాన్‌ను అధిగమించి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. నీతీ అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10వ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ”ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ” అని అన్నారు. ఐఎమ్ఎఫ్ డేటా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ కంటే పెద్దదని చెప్పుకొచ్చారు. ”అమెరికా, చైనా, జర్మనీ దేశాలే ప్రస్తుతం భారత్‌ కంటే ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత ప్రణాళికలకు మనం కట్టుబడి ముందుకు సాగితే వచ్చే 2.5-3 ఏళ్లల్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది” అని తెలిపారు.

భారత్‌లో ఐఫోన్‌ల తయారీపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై కూడా నీతీ అయోగ్ సీఈఓ స్పందించారు. సుంకాలపై ఇంకా అస్పష్టత కొనసాగుతోందని, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం భారత్‌లో తయారయ్యే ఫోన్లే చవకగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. రెండో దశ అసెట్ మానెటైజేషన్‌ను కూడా సిద్ధం చేస్తున్నామని త్వరలో దాని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

అమెరికాలో విక్రయించే ఫోన్లను అమెరికాలో తయారు చేయాలని ట్రంప్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో యాపిల్, శాంసంగ్ సంస్థలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. విదేశాల్లో తయారైన ఫోన్లను అమెరికాలో విక్రయించే సంస్థలపై కచ్చితంగా 25 శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.