బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ప్రీతి జింతా ఒకరు. ఈ అమ్మడు హిందీతో పాటు తెలుగులోను పలువురు సీనియర్ హీరోలతో కలిసి సందడి చేసింది.
ప్రజంట్ సినిమాలు కాస్త తగ్గించిన ఈ భామ బిజినెస్‌లతో బిజీ అయింది. అలాగే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి జింతా ఐపీఎల్లో హుషారుగా పాల్గోంటుంది. తన జట్టు మ్యాచులు ఉంటే చాలు.. మైదానంలో ఆమె హాడావుడి మాములుగా ఉండదు. ఇక తాజాగా ప్రీతి జింతా సైనిక కుటుంబాల పట్ల తన బాధ్యతను చాటుకొని అందరి మనసులు గెలుచుకుంది.
సౌత్ వెస్ట్రన్ కమాండ్‌లోని ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి ప్రీతి రూ. 1.10 కోట్లు విరాళం గా ప్రకటించింది. ఈ విరాళాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా అందజేశారు. జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీయ అధ్యక్షుడు శప్తా శక్తి, ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందజేయడం జరిగింది. వీర నారీమణుల సాధికారితకు, వారి పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారట. సైనికుల త్యాగాలకి మనం వెలకట్టలేము. వారి కుటుంబాలకి మనం అండగా ఉందామని పిలుపునిచ్చింది ప్రీతి.
































