ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ (AP Whats app Governance)లో రేషన్ కార్డులు (Ration Cards Download) అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 46 లక్షల 21 వేల 223 బియ్యం కార్డులు ఉండగా.. వాటిలో 4 కోట్ల 24 లక్షల 59 వేల 028 మంది ఉన్నారు. ఐదేళ్ల కంటే తక్కువ వయసు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులతో సహా 6 లక్షల 45 వేల 765 మందికి ఈ-కేవైసీ (EKYC) నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తినవారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు (Smart Ration Cards) ఇవ్వనున్నారు.అలాగే 50 ఏళ్లు పైబడిన అవివాహితులు, విడాకులు తీసుకున్నవారు, అనాథాశ్రమాల్లో నివసించేవారు, ట్రాన్స్ జెండర్లు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వాట్సాప్ లో రేషన్ కార్డు కోసం 9552300009 నంబర్ కు Hi అని మెసేజ్ చేస్తే.. సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ పౌరసేవలు, సివిల్ సప్లైస్ సేవలపై క్లిక్ చేసి.. దీపం స్థితి, రైస్ డ్రా, ఈ కేవైసీ, రైస్ కార్డుసమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన వంటి 8 రకాల సేవలు కనిపిస్తాయి. వీటి ద్వారా రేషన్ కార్డులో మార్పులకు అప్లై చేసుకోవచ్చు. అప్డేటెడ్ రైస్ కార్డును వాట్సప్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే కొత్తరేషన్ కార్డుకు (New Ration Card) అప్లై చేసుకునే సౌకర్యం లేకపోవడంతో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిగతా సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలి.
































