ఫోన్‌పే, గూగుల్ పే వాడే వారికి గుడ్ న్యూస్.. UPI పేమెంట్‌లు చేసేటప్పుడు కొన్నిసార్లు లావాదేవీలు ఆలస్యం కావడం వల్ల యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. UPI లావాదేవీల ప్రాసెసింగ్ సమయాన్ని దాదాపు 50 శాతం తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త సవరణలు జూన్ 16, 2025 నుంచి అమలులోకి రానున్నాయి.
ఈ మేరకు NPCI తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. వివిధ రకాల UPI లావాదేవీల గడువులను సవరిస్తూ ఈ సర్క్యులర్‌లో మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ద్వారా లావాదేవీలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు యూజర్లకు సౌలభ్యం కల్పించడంతో పాటు, డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి. ఈ సవరణలతో, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులు వేగంగా జరిగే అవకాశం ఉంది. NPCI ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలో డిజిటల్ లావాదేవీల సామర్థ్యాన్ని పెంచి, యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
































