భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పని చేసే వారు కూడా అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఇంత మంది ఉద్యోగుల జీతాల పెంపు విషయలో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటుంది. జీతాల పెంపును నిర్ణయించడానికి వేతన సంఘం వేస్తూ వారి సూచనలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎనిమిదో వేతన సంఘ సిఫారసుల కోసం వేచి చూస్తున్నారు. ఆ సిఫారసుల మేరకు జీతాల పెంపు ఉంటుందని ఆశపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులు వారి జీతాలు, పెన్షన్లు భత్యాలను సవరించడానికి జనవరి 2024లో అధికారికంగా ప్రకటించిన 8వ వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేస్తారు. భావిస్తున్నారు. వేతన కమిషన్లు దాదాపు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలను సవరించాయి. ఆరో వేతన కమిషన్ (2006), ఏడో వేతన కమిషన్ (2016) మూల వేతనంతో భత్యాలలో గణనీయమైన పెరుగుదలను తీసుకువచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక జీతం ఆరో సీపీసీ కింద రూ. 2,750 నుంచి 7,000కి, ఏడో సీపీసీ కింద రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెంచారు. ఈ నేపథ్యంలో వారు ఎనిమిదో వేతన సంఘం ద్వారా వారి జీతం ఎంత పెరుగుతుంది? అనే లెక్కలు వేసుకుంటున్నారు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన సంఘం అమలు చేసినప్పుడు సవరించిన మూల వేతనాన్ని లెక్కించడానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ఉపయోగిస్తారు. ఇది పాత వేతనం నుంచి కొత్త వేతన వ్యవస్థకు మారే సమయంలో ఏకరీతి జీతాల పెంపును నిర్ధారిస్తుంది.
జీతం పెంపు ఫార్ములా
కొత్త బేసిక్ పే = పాత బేసిక్ పే × ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఏడో వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. ఉదాహరణకు ఆరో సీపీసీ ప్రకారం ఒక ఉద్యోగి మూల వేతనం రూ. 10,000 అయితే వారి సవరించిన వేతనం రూ. 10,000 × 2.57 అంటే రూ. 25,700కు చేరింది.
ఎనిమిదో వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇలా
అనేక నివేదికల ప్రకారం ఎనిమిదో వేతన సంఘంలో ఫిట్మెంట్ కారకం 1.96 కావచ్చని అంచాన వేస్తున్నారు. 2016లో ప్రవేశపెట్టిన ఏడో వేతన సంఘం పాత గ్రేడ్-పే వ్యవస్థను పే మ్యాట్రిక్స్ అనే కొత్త నిర్మాణంతో భర్తీ చేసింది. ఈ వ్యవస్థ లెవెల్-1 నుంచి లెవెల్- 8 వరకు ఉద్యోగ స్థానాల ఆధారంగా జీతాలను వర్గీకరిస్తుంది. లెవెల్ 1 అంటే ప్యూన్, క్లర్క్, ఎంటీఎస్ వంటి ఎంట్రీ-లెవల్ పోస్టులు. లెవెల్-18 అంటే క్యాబినెట్ కార్యదర్శి వంటి ఉన్నత స్థాయి పదవులు ఉన్నవారు. ఒకవేళ ఫిట్మెంట్ కారకం 1.92 అయితే, లెవల్ 1 ప్రభుత్వ ఉద్యోగుల జీతం నెలకు దాదాపు రూ. 15,000 పెరగవచ్చు. అంటే ఎనిమిదో వేతన సంఘం ప్రకారం లెవెల్-1 ఉద్యోగుల జీతం ఏకంగా 40 శాతం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
































