అనంతపురం సరిహద్దుల్లో చంద్రబాబు భారీ స్కెచ్.. కర్ణాటక ఆందోళన చెందుతోందా?

 నాలుగు రోజుల కిందట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేరోజు ఆరుగురు కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీలో Niti Ayog పాలకమండలి సమావేశానికి ముందు రోజు ఆయన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా..


పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఓ పని కర్ణాటకకు కంగారు పుట్టించింది. రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఆయన సమావేశం కావడంలో పెద్ద వ్యవహారమే ఉందని అక్కడ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తోంది.

పరిశ్రమలను ఆహ్వానించడం.. పెద్ద పెద్ద ఇండస్ట్రీ డీల్స్ లాగేయడంలో ఏపీ సీఎం చంద్రబాబుకు పాతికేళ్లకు పైగా ట్రాక్ రికార్డ్ ఉంది. మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు.. అనంతపురముకు కియా KIA పరిశ్రమను అలాగే తెచ్చారు. దేశంలో చాలా రాష్ట్రాలు పోటీ పడినా సరే.. బాబు అప్పట్లో ఈ అతిపెద్ద FDI ని రాష్ట్రానికి తీసుకురాగలిగారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పెట్టుబడుల కోసం అలాగే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిఫెన్స్ మినిస్టర్‌ను కలిశారు.

లేపాక్షి వద్ద డిఫెన్స్ హబ్‌

చంద్రబాబు సాధారణంగా ఢిల్లీలో ఎక్కువుగా రాష్ట్రానికి సాయం కోసం ఆర్థిక మంత్రిని, లేదా పోలవరం కోసం జలవనరుల శాఖ మంత్రిని, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసేవారు. కానీ మొన్న వెళ్లినప్పుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు వాడుకోవడంలో చంద్రబాబు చాలా వేగంగా ఉంటారు. ఈనెలలో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. అందులో డిఫెన్స్ పరికరాలు పోషించిన పాత్ర అందరికీ అర్థమైంది. డ్రోన్లు, UAVలు, రాడార్ సిస్టమ్‌లు కీలకపాత్ర పోషించాయి. భవిష్యత్‌లో వాటికున్న భవిష్యత్‌ను కూడా చంద్రబాబు గుర్తించారు. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఓ ప్రపోజల్‌తో రాజ్‌నాథ్‌సింగ్ వద్ద వాలిపోయారు. లేపాక్షి, మడకశిర ప్రాంతాల్లో మీకు 10వేల ఎకరాలు ఇస్తాం.. అందులో డిఫెన్స్ హబ్ ఏర్పాటు చేయండని ప్రపోజల్ పెట్టారు. అత్యాధునిక డ్రోన్ల తయారీతో పాటు.. ఎయిర్ క్రాఫ్ట్ బిల్గింగ్ వంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబుకు రాజ్‌నాథ్‌తో రాజకీయంగా కూడా మంచి స్నేహం ఉంది. అది ఆయన మొన్న మీటింగ్‌లో చంద్రబాబును గౌరవించిన పద్ధతిలోనే అర్థమైంది. దీంతో ఈ ప్రపోజల్‌లో కదలిక వస్తుందని అనుకుంటున్నారు.

కర్ణాటకకు కంగారు ఎందుకు..?

చంద్రబాబు ప్రపోజల్ పెడితే కర్ణాటకకు కంగారు ఎందుకు అంటే.. కారణం ఉంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతంలో ఈ జోన్ ప్రపోజ్ చేశారు. లేపాక్షి, మడకశిర ప్రాంతాలు… బెంగళూరు విమానాశ్రయం నుంచి కేవలం ఒక గంట ప్రయాణ దూరంలో ఉంటాయి. కర్ణాటక దేశంలోనే అతిపెద్ద డిఫెన్స్ హబ్. హిందూస్తాన్ ఏరోనాటికల్స్ HAL తో పాటు.. అనేక ప్రేవేట్ రక్షణ పరికరాల సంస్థలున్నాయి. R&D సంస్థలు కూడా ఎక్కువుగానే ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ సంస్థలకు ఎంతదూరమో.. చంద్రబాబు ప్రపోజ్ చేస్తున్న డిఫెన్స్ హబ్‌కు కూడా అంతే దూరం. పైగా అవన్నీ నగరంలోపల ఉండటంతో విస్తరణకు అవకాశం లేదు. ఇక్కడైతే కావలసినంత భూమి అందుబాటులో ఉంది. చంద్రబాబు ప్రపోజల్ తర్వాత కేంద్ర ప్రభుత్వం HAL విస్తరణ ప్రాజెక్టులను కూడా ఇక్కడకు తరలిస్తుందేమో అన్న ఆందోళన అక్కడ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ కు చెందిన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, Advanced Medium Combat Aircraft (AMCA) and లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ Light Combat Aircraft (LCA) తయారీలను కొత్త స్థలానికి మార్చొచ్చని కర్ణాటకలో ఆందోళన వ్యక్తమైంది.

ఇది సరైన చర్య కాదు.. ఆందోళనకరం

HAL విస్తరణ ప్రాజెక్టు ఆగిపోతుందన్న ఆందోళన మొదలయ్యేసరికి.. కర్ణాటక భారీ పరిశ్రమల మంత్రి MB పాటిల్ స్పందించారు. లోకల్ మీడియా అడిగిన ప్రశ్నలకు రెస్పాండ్ అవుతూ.. “ఈ చర్య సరైంది కాకపోవడమే కాదు.. ఆందోళనకరం ” కూడా అన్నారు. చంద్రబాబు తన రాష్ట్రంలో డిఫెన్స్‌ హబ్ ఏర్పాటు చేసుకోవడం తప్పేం కాదు. అలాగే డిఫెన్స్ విస్తరణ ప్రాజెక్టులను పెట్టమని కోరవచ్చు. కానీ కర్ణాటకలో ఉన్న.. కర్ణాటక ప్రయోజనాలకు భంగం కలిగించేలా చేయడం సరికాదు. “నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాను. అలాగే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాను. మా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రులకూ వివరిస్తాను. ఏపీ HAL విస్తరణ ప్రాజెక్టును పెట్టమని కోరవచ్చు. అందులో తప్పేం లేదు. కానీ ఇప్పటికే మా దగ్గర ఉన్న ప్రాజెక్టును తరలించాలనుకోవడం మాత్రం కరెక్టు కాదు. చంద్రబాబు అలాంటి ప్రకటన చేశారు అనుకోవడం లేదు. ఒక వేళ అలా జరిగితే మాత్రం అది సరైన చర్య కాదు” అని ఆయన అన్నారు.

లేపాక్షికి డిఫెన్స్ హబ్ వస్తుందా..?

కర్ణాటక స్పందిస్తున్న తీరుతో ఏపీ ప్రాజెక్టుకు అనుకూలత ఉందని కూడా అర్థం అవుతోంది. దేశంలో ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తుల తయారీ 65శాతం కర్ణాటకలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఉత్తర ప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్లు ప్రకటించింది. రక్షణ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న తమకు మాత్రం డిఫెన్స్ కారిడార్‌ ప్రకటించలేదని కర్ణాటక కేంద్రంపై విమర్శలు చేస్తోంది. మొన్నటి యుద్ధ పరిణామాలతో భవిష్యత్‌లో రక్షణ రంగంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి ఎంత ప్రాథాన్యం ఉందో.. అర్థం అయింది. ఇప్పుడు ఏపీ ప్రపోజ్ చేసిన స్థలం కర్ణాటకతో కలిసే ఉంది కాబట్టి.. రెండు రాష్ట్రాలను కలపి కారిడార్‌గా ప్రకటించడానికి కూడా అవకాశాలున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.