ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరిగా చెలామణి అయిన విజయసాయిరెడ్డి అధికారం కోల్పోయాక మాత్రం ఆ పార్టీకి, రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు.
అయితే రాజకీయాలు వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డిని పాత బంధాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన తప్పనిసరిగా తిరిగి అదే రాజకీయ నేతల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో సహజంగానే ఆయన్ను విమర్శలు వెంటాడుతున్నాయి.
ఇదే క్రమంలో తాజాగా టీడీపీలో చంద్రబాబు ఆత్మగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ను విజయసాయిరెడ్డి అనుకోకుండా కలిశారు. ఆ తర్వాత రోజే ఆయన వైసీపీ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కాం విచారణకు హాజరయ్యారు. దీంతో మద్యం స్కాం విచారణలో ఏం చెప్పాలో టీడీపీ నేత టీడీ జనార్ధన్ ఆయనకు గైడ్ చేశారన్న విమర్శల్ని వైసీపీ ఎక్కుపెట్టింది. దీనిపై తొలుత స్పందించని సాయిరెడ్డి.. విమర్శల తాకిడి ఎక్కువయ్యే సరికి నిన్న ఉన్నట్లుండి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ను ఓసారి గమనిస్తే తాను సైలెంట్ గా ఉంటున్నా వైసీపీలో జగన్ కోటరీ కెలకడం వల్లే స్పందిస్తున్నట్లు సాయిరెడ్డి తెలిపారు. అలాగే ఇలాంటి పనులతో కోటరీ పెద్దలు నంబర్ టూ కావచ్చేమో కానీ జగన్ కు ప్రయోజనం లేదన్నారు. కేసులు మీద వేసుకోకపోవడం వల్లే తనకు వెన్నుపోటు పొడిచారని, గతంలోలా కేసులు మీద వేసుకుంటే మాత్రం మంచోడిలా మిగిలే వాడినన్నారు. తాను కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్తే అక్కడికి టీడీ జనార్దన్ వచ్చారని, అయినా తాము మాట్లాడుకోలేదన్నారు.
అలాగే టీడీపీలో చేరనని ముందే చెప్పానని, చేరాలనుకుంటే టీడీ జనార్ధన్ ఎందుకు చంద్రబాబు, లోకేష్ నే కలుస్తానని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్ ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్ధులని, ఇప్పుడు కాదన్నారు. అలాగే లిక్కర్ స్కాం లేదని జగన్ అంటుంటే స్కాం రహస్యాలు మాట్లాడేందుకు తాను టీడీపీ నేతల్ని కలిశానని కోటరీ ప్రచారం చేస్తోందన్నారు. తద్వారా జగన్ ఇప్పటికీ కోటరీ మాయలోనే ఉండి తనపై విమర్శలు చేస్తున్నారనేది చెప్పకనే చెప్పారు. అలాగే టీడీపీలో చేరాలంటే నేరుగానే చేరతానని, దొంగచాటు చర్చలు చేయనని కుండబద్దలు కొట్టేశారు.
సాయిరెడ్డి వ్యాఖ్యలు జగన్ సొంత జిల్లా కడపలో మహానాడు నిర్వహిస్తున్న టీడీపీకి బూస్ట్ ఇచ్చాయి. వైసీపీలో నిత్యం టీడీపీని టార్గెట్ చేస్తున్న నేతలకు సాయిరెడ్డి కౌంటర్ ఇవ్వడం మహానాడు వేళ ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. కడపలో మహానాడు పెట్టడం ద్వారా ఇది వైఎస్ అడ్డా అనే ప్రచారానికి చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తున్న వేళ.. సాయిరెడ్డి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ తనకు ప్రత్యర్దులు కారని చెప్పడం ద్వారా నైతికంగా బూస్ట్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది.
































