ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ తీసుకునేవారికి తీపికబురు.. ఈసారి ఒకరోజు ముందుగానే పింఛన్ ప్రభుత్వం చేతికి అందిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియలో కీలకమైన మార్పులు చేసింది.
పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో పాటు పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచింది. దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచింది. పింఛన్లను ప్రతీ నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు.
ఒకటో తేదీ ఆదివారం లేదా పండుగ రోజు వస్తే, ముందు రోజునే పింఛన్ పంపిణీ చేస్తారు. ఒకవేళ సెలవు రోజులు, పండుగలు వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయనున్నారు..
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేసింది. జూన్ 1న ఆదివారం సెలవు ఉంది.. అందుకే ఒక రోజు ముందుగా, అంటే మే 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇస్తారు.
లబ్ధిదారులు ఎవరూ సచివాలయానికి లేదా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31న డబ్బులు తీసుకోలేకపోతే, జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు. మే 31న పింఛన్లు పంపిణీ చేయాలి కాబట్టి.. దీని కోసం సచివాలయం ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి మే 30న డబ్బులు డ్రా చేస్తారు.
పింఛన్ తీసుకునేవారు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే, భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ ఇస్తారు. ఈ కేటగిరీని గత ఏడాది నవంబరు నుంచే అమలు చేస్తున్నారు. ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు రూ.4 వేలు ఇస్తారు. అంతకుముందు 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పింఛన్ ఇవ్వాలని సెర్ఫ్ ఆదేశించింది. అర్హులైన మహిళలు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడుతుందిని చెబుతున్నారు అధికారులు.
































