తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది టీడీపీ శ్రేణుల కరతాళ ధ్వనుల నడుమ పండుగ మొదలైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు.
టీడీపీ సాధించిన విజయాలు..దారి పొడవునా ఎదురైనా ఇబ్బందులు..గత ఐదేళ్లలో పడిన కష్టాలు.. ఏపీ భవిష్యత్.. ఇలా అన్నిఅంశాలను మాట్లాడిన చంద్రబాబు ఆరు శాసనాల గురించి ప్రస్తావించారు. వాటిని మంత్రి నారా లోకేష్ ప్రవేశపెడతారని ప్రకటించారు. దీంతో మహానాడులో ఒక్కసారిగా ఉద్విగ్నభరిత వాతావరణం వచ్చింది. ఏంటీ ఆరు శాసనాలు అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం ప్రారంభించారు. టీడీపీ శ్రేణులు ముక్తకంఠంతో ఆహ్వానించాయి. ఆహ్వానం పలుకుతూ నినాదాలు చేశాయి. 1, తెలుగుజాతి విశ్వఖ్యాతి 2,యువగళం 3, స్త్రీశక్తి 4,పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్ 5,అన్నదాతకు అండగా 6, కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలు ప్రకటిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు నారా లోకేష్.
ముఖ్యంగా మహిళల విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా మాట్లాడాలని నారా లోకేష్ సూచించారు. కొన్ని తప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అటువంటి మాటలను అనవద్దని కూడా సూచించారు. ముఖ్యంగా గాజులు వేసుకున్నావా.. చీర కట్టుకున్నవా? అనే విషయాలను పూర్తిగా వాడకూడదని అభిప్రాయపడ్డారు లోకేష్. మహిళలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళా మంత్రిగా రోజా చేసిన కామెంట్స్ ను, చర్యలను ప్రస్తావించారు. ఓ విషయంలో నారా లోకేష్ కు గాజులు, చీరె పంపిస్తానని రోజా సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో స్ట్రాంగ్ గా రియాక్టయ్యారు లోకేష్. పంపించండి ..వాటిని మా ఆడబిడ్డలకు అందించి వారి ఆశీర్వాదం పొందుతా అంటూ నాటి సంగతులను మహానాడు వేదికగా గుర్తుచేసుకున్నారు లోకేష్. అప్పుడే అసెంబ్లీ వేదికగా కుటుంబాల కోసం మాట్లాడిన వైసీపీ నేతల ప్రస్తావన వచ్చింది. అటువంటి పద్దతికి చెక్ చెబుతామని లోకేష్ పిలుపునివ్వడం విశేషం.
పార్టీ శ్రేణుల్లో చర్చ..
నారా లోకేష్ ప్రసంగం మహానాడుకు వచ్చిన పార్టీ శ్రేణులకు ఆలోచింపజేసింది. తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశమని అభివర్ణించారు. టీడీపీకి అధికారం కొత్తకాదని.. ప్రతిపక్షం కొత్తకాదని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ, ఎల్లప్పుడూ టీడీపీ బడుగులకు అండగా నిలుస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్నిరంగాల్లో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీని కాపలా కాస్తున్నారని.. అటువంటి వారికి శిరసువంచి పాదాభివందనం చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ ముహూర్త బలం బాగుందన్నారు. అందుకే నాలుగు దశాబ్దాల ప్రస్థానం సాగించిందన్నారు. అటు లోకేష్ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేస్తూనే.. పార్టీ కోసం పూర్తిస్థాయిలో వివరించడం విశేషం.మరోవైపు లోకేష్ ప్రకటించిన ఆరు శాసనాలు ఇప్పుడు చర్చకు దారితీశాయి.
వైసీపీ నేతల్లో ఆందోళన..
మరోవైపు మాజీ మంత్రి రోజా చీర, గాజుల సవాల్ ను గుర్తుచేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నారా లోకేష్ విషయంలో రోజా రెచ్చిపోయేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. నిండు సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. లోకేష్ కు ఒకసారి సవాల్ చేస్తూ చీరలు, గాజులు పంపిస్తానని చెప్పారు. అప్పట్లో అది పెను దుమారానికి దారితీసింది. మరోసారి నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ లోకేష్ మహానాడులో రోజా ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. తప్పకుండా రోజాపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
































