పన్నులుండవ్‌, లగ్జరీ లైఫ్‌.. సంపన్నుల స్వర్గధామం ‘మొనాకో’

అదో చిన్న దేశం. ఫ్రాన్స్‌కు ఆగ్నేయంగా ఉన్న మధ్యధరా తీరప్రాంతం. జనాభా కేవలం సుమారు 38వేలు. కానీ.. ఎక్కడ చూసినా ఖరీదైన కార్లు, భవనాలు, తీరంలో కళ్లుచెదిరే యాట్‌లే దర్శనమిస్తాయి.


ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్లు ఇక్కడే కనిపిస్తారు. ఇక్కడ స్థిరనివాసం కోసం కొంతమంది చూస్తుంటే.. మరికొందరు మాత్రం కనీసం ఇక్కడ చిరునామా ఉంటే చాలని భావిస్తున్నారు. లగ్జరీ లైఫ్‌స్టైల్‌, ఆదాయపు పన్ను మినహాయింపు వంటి నిబంధనలతో సంపన్నులకే స్వర్గధామంగా మారింది. అదే.. మొనాకో (Monaco).

చిన్న దేశమైనా..

ఇక్కడ ఏ మూల చూసినా సంపన్నులే. లాంబోర్గినీ, రోల్స్‌ రాయిస్‌తోపాటు అనేక రకాల సూపర్‌కార్లు మొనాకో వీధుల్లో విహారం చేస్తుంటాయి. అటు తీర ప్రాంతంలోనూ ఫ్లోటింగ్‌ మాన్షన్స్‌గా దర్శనమిస్తాయి. ఇక్కడ జరిగే మొనాకో గ్రాండ్‌ ప్రిక్స్‌ (Formula One) రేసింగ్‌ భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈవెంట్‌ను చూసేందుకు వచ్చిన వారితో వీధులు మొత్తం నిండిపోతాయి. పేరుకు చిన్నదేశమైనప్పటికీ.. సంపదలో మాత్రం ప్రపంచంలో అగ్రదేశాల సరసన ఉంటుంది. వరల్డ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం.. ఇక్కడివారి తలసరి జీడీపీ 2.56లక్షల డాలర్లు (రూ.2.18కోట్లు). ఇది అమెరికాకంటే (82వేల డాలర్లు) ఎక్కువ. మొత్తంగా ఇక్కడ నివసిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సంపన్నులే కావడం విశేషం.

లగ్జరీ లైఫ్‌, పన్నులుండవ్‌..

మొనాకోకు సంపన్నులు క్యూ కట్టడం వెనక భద్రతాపరంగా సురక్షిత ప్రాంతం కావడం, అంతర్జాతీయ స్కూళ్లు, వరల్డ్‌ క్లాస్‌ వైద్య సదుపాయాలు, ఆదాయపు పన్ను నిబంధనలు ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉండదు. మూలధన లాభాల పన్ను కూడా లేదు. వారసత్వ పన్ను కూడా చెల్లించనవసరం లేదు. కొందరికి ఉన్నా.. గరిష్ఠంగా 16% మాత్రమే ఉంటుంది. ఉన్నత జీవన ప్రమాణాలు, రాజకీయ స్థిరత్వం కూడా సంపన్నులు మొనాకోవైపు చూడటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఆర్థిక సంక్షోభం నుంచి..

ఇప్పుడు ఇంతటి సంపన్న నగరంగా పేరొందిన మొనాకో.. 19వ శతాబ్దం మొదట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో మాంటే కార్లో క్యాసినో ఏర్పాటు చేస్తూ ప్రిన్స్‌ చార్లెస్‌ III తీసుకున్న నిర్ణయం మొనాకో తలరాతనే మార్చేసింది. ప్రధానంగా ఆదాయపు పన్ను రద్దు చేయడం సంపన్నులను ఆకర్షించింది. ఫ్రాన్స్‌ పౌరులకు మినహా మరెవ్వరికీ ఇక్కడ ఆదాయపు పన్ను ఉండదు. ఇందుకు సంబంధించి 1869లోనే ఓ ఒప్పందం జరిగింది. క్యాసినోల నుంచి వచ్చే ఆదాయాన్నే ప్రభుత్వ ఖర్చులకు వినియోగిస్తారు. రియల్‌ ఎస్టేట్‌ పరంగానూ అత్యంత ఖరీధైన నగరమిది.

అడుగుపెట్టడం భారమే..

ఇంత లగ్జరీ నేపథ్యమున్న మొనాకోకు వెళ్లడం అంత సులువు కాదు. ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలన్నా.. ఆదాయపు పన్ను ప్రయోజనాలను ఎంజాయ్‌ చేయాలన్నా కొన్ని నిబంధనలను పాటించాల్సిందే. ఇక్కడకు రావాలంటే కనీస వయసు 16ఏళ్లు ఉండాలి. ఎటువంటి నేరచరిత్ర లేదని పోలీసు ధ్రువీకరణ అవసరం. సొంతిళ్లు లేదా రెంటెడ్‌ హౌస్‌ ఉంటేనే అనుమతిస్తారు.

ఇక్కడ ఉండడానికి ఆర్థికంగా బలంగా ఉన్నామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలో ఆరునెలల కంటే ఎక్కువ కాలం ఉండాలి. తక్కువ వ్యవధి ఉండాలంటే అదనపు దస్త్రాలు అవసరం. అయితే, ప్రపంచంలో కేవలం మొనాకోలో మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు లేదు. యూఏఈ, ఖతర్‌, బెర్ముడా, ఒమన్‌, కువైట్‌ దేశాల్లోనూ ఇటువంటి అవకాశాలున్న విషయం తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.