బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి హాని జరగదని, సముద్రంలోకి వెళ్లే నీటినే మళ్లించుకుంటామని చంద్రబాబు కడప వేదికగా ప్రకటించారు.
మహానాడులో మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరవాత చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. ఏపీ అత్యంత దిగువ రాష్ట్రమని. ఏపీకి వరదలు వస్తే అవి సముద్రంలోకి వెళ్లిపోతాయన్నారు. ఆ నీటిని రాయలసీమకు మళ్లించుకునేందుకు బనకచర్ల నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ కేటాయింపుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా తోడుకోబోమని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు వంటివి అని చంద్రబాబు మరోసారి ప్రకటించారు.
అలాగే బెంగళూరులో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమను అక్కడి నుంచి తొలగించి ఏపీలో పెట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారంటూ కర్ణాటకలో జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. తాను ఎప్పుడూ అలాంటి పనులు చేయబోనని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు తరలించుకుపోవాలని అనుకోనన్నారు. అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. లేపాక్షి ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూలమని.. ఆ అంశంపైనే కేంద్రంతో చర్చించానన్నారు.
కడప స్టీల్ ప్లాట్ పనులు పది రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు. గజంలో ఈ స్టీల్ ప్లాంట్ కు జిందాల్ శంకుస్థాపన చేశారు.కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని చంద్రబాబు అన్నారు రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు. గత ఐదేళ్లు ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. . బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారని అయితే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. శాంతిభద్రతలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. తప్పు చేసినవారి పట్ల చండశాసనుడిలా ఉంటానని చంద్రబాబు హెచ్చరిచారు. రాయలసీమను ఎడారి కానివ్వమని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే, 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మరోసారి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు
చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1995లో తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. మూడు దశాబ్దాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1982లో ఎన్టీఆర్ స్థాపించినా, 1995లో పార్టీ పగ్గాలు చంద్రబాబు తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబుకు, పార్టీ అధ్యక్ష పదవిలో మరోసారి బాధ్యతలు అప్పగించడంలో కార్యకర్తలు ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రబాబు తెలిపారు.
































