‘రామాయణం’ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ రంగంలోకి దిగారు.

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. ‘రాకింగ్ స్టార్’ యష్, ఈ భారీ చిత్రంలో రావణుని పాత్రలో సన్నద్ధమవుతున్నారు. హాలీవుడ్‌లో పేరొందిన స్టంట్ దర్శకుడు గై నోరిస్‌తో కలిసి, ఆయన ఈ చిత్రంలోని ఉద్విగ్న యాక్షన్ దృశ్యాలను అద్వితీయంగా రూపొందిస్తున్నారు. ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన గై నోరిస్, ఇప్పుడు ‘రామాయణం’ కోసం భారతదేశానికి విచ్చేసి, యాక్షన్ దృశ్యాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రం భారతీయ పురాణ గాథను విశ్వవ్యాప్తంగా ఆవిష్కరించేందుకు అత్యున్నత స్థాయిలో రూపొందుతోంది.


యష్ ఈ చిత్రంలో కేవలం నటుడిగా మాత్రమే కాక, సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తూ, సృజనాత్మకంగా ప్రతి అంశంలో తనదైన ముద్ర వేస్తున్నారు. రావణుని పాత్రను కొత్త కోణంలో, అత్యంత శక్తివంతంగా చూపించేందుకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆయన పాత్ర యాక్షన్‌తో నిండి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని అంచనా. తాజాగా విడుదలైన సెట్‌లోని చిత్రాల్లో యాష్, యుద్ధ సన్నద్ధ రూపంలో, శక్తిమంతమైన రావణునిగా అద్భుతంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన శారీరక రూపాంతరం రావణుని పాత్రకు పరిపూర్ణ న్యాయం చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మహాకావ్య చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) మరియు యాష్ (మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘రామాయణం – పార్ట్ 1’ దీపావళి 2026లో, రెండవ భాగం దీపావళి 2027లో విడుదల కానుంది. భారతీయ సినిమా చరిత్రలో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.