ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి.. వెంటనే జాగ్రత్త పడండి

ఎవరైనా సరే ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తే అది ఆరోగ్యంపై, మనసుపై, సంబంధాలపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు ఏదైనా విషయంపై మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని అనిపిస్తే.. అది అతిగా ఆలోచిస్తున్నట్టు సంకేతం. ఇది సమయానికి గుర్తిస్తే ఈ పరిస్థితిని స్వయంగా నియంత్రించవచ్చు.

ఏదైనా చిన్న విషయం జరిగినా అది పూర్తయిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ ఆలోచిస్తుంటే.. అది మానసిక సమస్యకు సంకేతం. ఉదాహరణకి ఎవరైనా మీతో ఏదైనా మాట చెప్పారు. ఆ విషయం అక్కడే ముగిసినా.. మీరు దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తుంటే.. మీరు అతిగా ఆలోచిస్తున్నారని అర్థం. ఈ ఆలోచనల వల్ల తల దించుకుని కూర్చోవడం.. పని మీద దృష్టి లేకపోవడం జరుగుతుంది.


కొన్నిసార్లు గతం గుర్తుకు వచ్చి ఏడవడం సహజమే. కానీ ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటే.. అది మనసుపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. అలాంటి వేళ మనం ఆలోచనలు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల బాధ ఎక్కువవుతుంది. ఇది కూడా అతిగా ఆలోచించే లక్షణాల్లో ఒకటి.

కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువసేపు తీసుకోవడం.. చివరికి ఏదీ నిర్ణయించలేక పోవడం కూడా ఒక సంకేతం. ఏదైనా పని చేయాలంటే ముందుగా భయపడటం, మన అభిప్రాయాన్ని చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం కూడా అతిగా ఆలోచించే లక్షణాలు. ఇలా ఉంటే పనులు ఆలస్యమవుతాయి.. అవకాశాలు చేజారిపోతాయి.

రాత్రిళ్లు మనసు ప్రశాంతంగా లేకపోతే నిద్ర బాగా రాదు. నిద్రలోంచి మధ్యలో మేల్కొనడం, మళ్లీ నిద్ర పట్టకపోవడం జరిగితే ఇది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. దీర్ఘకాలంగా ఇలా జరుగుతుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

బయటకు మాట్లాడకపోవడం కూడా అతిగా ఆలోచించటానికి ప్రధాన కారణం. మీరు మీలోనే అన్ని ఆలోచనలు దాచుకుంటే అవి పెద్ద భారంగా మారుతాయి. అందుకే నమ్మకంగా ఉన్న వ్యక్తితో మీ ఆలోచనలను చెప్పడం మంచిది. ఇలా మాట్లాడటం వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది. మీకు ఇష్టమైన పాట విని ప్రశాంతంగా ఉండొచ్చు. దీని వల్ల కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

ఈ లక్షణాలు కనిపించినప్పుడు వాటిని అలానే వదిలేయకండి. సమస్య పెరగకుండా ముందే గుర్తించాలి. రోజూ చిన్న చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీరు ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించగలరు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.