ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య ఊబకాయం. అధిక బరువుతో బాధపడుతూ కుండలాంటి పొట్టను కరిగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేటి తరం. జిమ్ కు వెళ్లడం,కఠినమైన ఆహార నియమాలు పాటించడం వంటి రకరకాల పద్ధతులను ఫాలో అవుతారు.
నిజానికి బరువు తగ్గడానికి భారీ కసరత్తులు, ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా దూరం చేసుకోవడం మాత్రమే మార్గాలు కావు. చిన్న చిన్న జీవనశైలి మార్పులతోనే అద్భుతాలు సాధించవచ్చని నిరూపించారు ఉదితా అగర్వాల్. 8 నెలల్లోనే నేచురల్ పద్ధతిలో ఏకంగా 30 కిలోల బరువు తగ్గింది ఉదితి.
జిమ్ లో అడుగుపెట్టకుండానే,కఠినమైన డైట్‌లు పాటించకుండా కేవలం లైఫ్ స్టైయిల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆమె బరువు తగ్గింది. ఏప్రిల్ 13న ఆమె తన సోషల్ మీడియా పోస్ట్ లో తన ఫిట్‌నెస్ ప్రయాణంలో విజయానికి కారణమైన కొన్ని ముఖ్యమైన రోజువారీ అలవాట్లను మనతో పంచుకున్నారు. అవేంటో వివరంగా చూద్దాం.
ఉదితా అగర్వాల్ 8 అలవాట్లు
ఉదయాన్నే ఒక డీటాక్స్ మ్యాజిక్
ఉదితా అగర్వాల్ తన రోజును ఇంట్లో తయారుచేసిన ఒక ప్రత్యేకమైన డీటాక్స్ డ్రింక్ తో ప్రారంభిస్తారు. జీలకర్ర, వాము, సోంపు, మెంతులు వంటి సుగంధ ద్రవ్యాలను నీటిలో మరిగించి తయారుచేసుకునే ఈ పానీయం కడుపు ఉబ్బరం తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుందని ఆమె నమ్మకం. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.
చిన్న పొరపాటు..పెద్ద నష్టం కాదు
ఆహార నియంత్రణలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు దారి తప్పడం సహజం. అయితే ఒక చిన్న పొరపాటు జరిగిందని ఆ రోజంతా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకూడదని ఉదితా అగర్వాల్ తెలిపింది. పొరపాటు జరిగినా వెంటనే తేరుకుని తర్వాతి భోజనం నుంచి తిరిగి తన ప్రణాళికకు కట్టుబడి ఉండేదాన్నని ఉదితా తెలిపింది. ఈ మానసిక దృఢత్వమే ఆమెను లక్ష్యం వైపు నడిపించింది.
భయంతో కాదు ధైర్యంతో
ప్రతిరోజూ బరువు చూసుకోవడం చాలా మందికి భయానకమైన విషయం. కానీ ఉదితా అగర్వాలం దీన్ని సానుకూల అంశంగా మార్చుకున్నారు. బరువు అప్పుడప్పుడు కొంచెం పెరిగినానిరుత్సాహపడకుండా, తన ప్రయత్నంపై నమ్మకం ఉంచి దినచర్యను కొనసాగించేవారు. ఇది తన పురోగతిని అంచనా వేసుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకోవడానికి ఉపయోగపడిందని ఆమె తెలిపింది.
ఇంటి భోజనమే
బయటకు వెళ్లినప్పుడు అనారోగ్యకరమైన ఆహారం తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని అధిగమించడానికి ఉదితా అగర్వాల్ ఒక సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. పనుల మీద బయటకు వెళ్లినా, ఏదైనా కార్యక్రమానికి హాజరైనా, తనతో పాటు ఇంట్లో వండిన భోజనాన్ని బాక్సులో తీసుకెళ్లేవారు. దీనివల్ల బయట ఆహారంపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది, ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నామన్న తృప్తి మిగులుతుందని తెలిపింది.
చియా గింజల వాటర్
శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం. ఉదిత రోజూ 3-4 లీటర్ల నీరు తాగడమే కాకుండా అదనంగా అర లీటరు నీటిలో చియా గింజలను నానబెట్టి రోజంతా కొద్దికొద్దిగా తీసుకునేవారు. చియా గింజలు ఫైబర్ అధికంగా ఉండి కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు శరీరానికి అదనపు పోషకాలను అందిస్తాయి. ఇది కూడా ఒక రకమైన డీటాక్స్ పానీయంగా పనిచేస్తుంది.
టీ ఓకే..స్నాక్స్ నో
చాలామందికి టీ లేదా కాఫీతో పాటు ఏదైనా నూనెలో వేయించిన పదార్థాలు లేదా ప్యాకేజ్డ్ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఉదిత ఈ అలవాటును పూర్తిగా మార్చుకున్నారు. ఆమె టీని ఆస్వాదించేవారు, కానీ దాంతో పాటు అనవసరమైన స్నాక్స్ తీసుకోకుండా జాగ్రత్తపడ్డారు. ఇది తెలియకుండానే అధిక కేలరీలు తీసుకోవడాన్ని నిరోధిస్తుంది.
మైదాకు గుడ్ బై
ఉదిత తన ఆహారం నుంచి మైదాను పూర్తిగా తొలగించారు. అయితే చక్కెర విషయంలో మరీంత కఠినంగా ఉండలేదు. పూర్తిగా మానేయకుండా మితంగా తీసుకునేవారు. ఇది తన ఆహార ప్రణాళికను వాస్తవికంగా దీర్ఘకాలం పాటించేలా చేయడానికి సహాయపడిందని ఆమె తెలిపారు. పూర్తిగా నిషేధించడం కంటే నియంత్రణ మేలని ఆమె భావన.
భోజనానికి ముందు కాస్త నీరు
ఇది చాలా చిన్నదిగా అనిపించినా, ఎంతో ప్రభావవంతమైన అలవాటు. ప్రతి భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల కడుపు కొంత నిండినట్లు అనిపించి అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా ఇది తోడ్పడుతుంది. ఈ చిన్న చిట్కా ఆమెకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చింది.
































