ఒక సంవత్సరం పాలనలో ఏపీకి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తోంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల్లో విజయం సాధించి..


ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2024 జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. మంత్రులుగా నారా లోకేష్, ఇతర నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో 2025 జూన్ 12 నాటికి ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో ఎన్డీఏ కూటమి సర్కారు సాధించిందేంటీ, ఏయే రంగాల్లో ఏ మేరకు అభివృద్ధి జరిగిందనే విషయాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనే వివరాలను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.

ఎన్డీఏ కూటమి ఏడాది పాలనలో ఏపీ పారిశ్రామిక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేసిందని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ 9.4 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించిందని మంత్రి టీజీ భరత్ వివరించారు. కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో టీజీ భరత్ ఈ వివరాలను వెల్లడించారు. వైసీపీ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉండేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రివర్గం కృషితో ఏపీపై పెట్టుబడిదారులకు విశ్వాసం కల్గుతోందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డులోని సభ్యులను 60 నుంచి 10కి కుదించారని టీజీ భరత్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డులో 50 మంది నిపుణులను నియమించామన్నారు. మహానాడు జరుగుతున్న సమయంలోనే పెట్టుబడుల ఆకర్షణ కోసం ఓ బృందం జపాన్‌లో పర్యటిస్తున్న విషయాన్ని టీజీ భరత్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదని.. స్పీడ్ ఆఫ్ బిజినెస్ ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని టీజీ భరత్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ వివరించారు. అందులో భాగంగా ఇప్పటికే 11 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించామని.. మరో 39 చోట్ల శంకుస్థాపనలు చేసినట్లు మంత్రి వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.