ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశాలకు హాజరయ్యే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది.
ఈ మేరకు సోమవారం జీవో జారీచేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 5, 6 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని ఏపీజీఈఏ నిర్ణయించింది. వీటిలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా రెండ్రోజులు ప్రత్యేక సెలవులివ్వాలని ప్రభుత్వాన్ని సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కోరారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం పాక్షికంగా అంగీకరించింది. 5వ తేదీన మాత్రమే సెలవు మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ ప్రత్యేక సెలవును పొందాలనుకునే ఉద్యోగులు తప్పనిసరిగా సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని, వారికి మాత్రమే సెలవు లభిస్తుందని జీవోలో తెలిపింది.































