మానవులకు అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కళ్లు ఒకటి. ఏదైనా కారణంతో చూపును కోల్పోతే.. ! ఊహించుకోవడానికే ఇబ్బందిగా అనిపిస్తోంది కదూ..! మనం ఈ ప్రపంచాన్ని చూడలేమనే ఊహ నిజానికి చాలా భయంకరమైనది.
కానీ ఆ చూపును తిరిగి పొందగలిగే అవకాశం ఉందని తెలిస్తే.. ఎంత సంతోషం! ఎంత అద్భుతం! అలాంటి ఆశలనే రేకెత్తిస్తోంది ఓ తాజా పరిశోధన. ఆ వివరాలేంటో చూద్దాం.
*సాధారణంగా మాక్యులర్ డీజనరేషన్ అండ్ రెటినిటిస్ పిగ్మెంటోసా(Macular Degeneration and Retinitis Pigmentosa) వంటి రెటినల్ డీజనరేటివ్ వ్యాధుల వల్ల కొన్నిసార్లు బాధితులు కంటి చూపును కోల్పోతుంటారు. అయితే ఇలా కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడానికి ఒక ఆశాజనక విధానం ఉందంటున్నారు బ్రౌన్ యూనివర్సిటీ(Brown University)కి చెందిన పరిశోధకకులు. ఏంటంటే.. కంటిలో గోల్డ్ నానోపార్టికల్స్‌ను ఇంజెక్ట్ చేయడం ద్వారా అది సాధ్యం అవుతుందని చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు రెటినల్ డిజార్డర్స్ ఉన్న ఎలుకల రెటినాలలో సూక్ష్మమైన గోల్డ్ నానోరాడ్లను ప్రవేశపెట్టారు. ఈ నానోపార్టికల్స్ మనిషి తల వెంట్రుకలకంటే కూడా వేలరెట్లు సన్నగా ఉంటాయి. ముఖ్యంగా నీర్-ఇన్ఫ్రారెడ్ కాంతి(Near-infrared light)కి స్పందించేలా రూపొందించబడ్డాయి.
*గోల్డ్ నానోపార్టికల్స్‌ను కంటిలో ఇంజెక్ట్ చేయడం(Injecting gold nanoparticles into the eye) ద్వారా, నీర్-ఇన్ఫ్రారెడ్ కాంతి వల్ల ఉత్తేజితమై తక్కువ మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ పరిస్థితి రెటినాలోని బైపోలార్, అండ్ గ్యాంగ్లియన్ కణాలను యాక్టివేట్ చేస్తుంది. అంటే ఈ కణాలు ఫోటోరిసెప్టర్లు దెబ్బతిన్నప్పటికీ పనిచేస్తాయి. దీంతో దృశ్య సంకేతాల(Visual cues)ను మెదడుకు అందడం ద్వారా కంటిచూపు తిరిగి వచ్చినట్లు ఎలుకలపై జరిగిన పరిశోధనలో తేలింది. గోల్డ్ నానోపార్టికల్స్ ఎలుకల కంటిలోని విజువల్ కార్టెక్స్లలో కణాలను యాక్టివేట్ చేయడం, బ్రెయిన్‌కు సమాచారం అందించడం వంటివి వాటి కంటి చూపు పునరుద్ధరించబడింది. పైగా ఈ టెక్నిక్కు ఇన్వేసివ్ సర్జరీ లేదా జన్యు సవరణ కూడా అవసరం లేదు.
*భవిష్యత్తులో రోగులు ఇన్ఫ్రారెడ్ లేజర్లతో కూడిన ప్రత్యేక గాగుల్స్ ధరించడం ద్వారా కూడా నానోపార్టికల్స్‌ను యాక్టివేట్ చేయవచ్చని, దీనివల్ల దృష్టి సామర్థ్యం పునరుద్ధరించబడవచ్చని పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. అయితే ఈ విధానం ఇంకా ప్రయోగాత్మక దశలో ఉంది. కేవలం జంతు నమూనాలలో మాత్రమే పరీక్షించబడింది. అయినప్పటికీ ఇది భవిష్యత్తులో మానవులు దృష్టి నష్టానికి(vision loss), అంటే వ్యాధుల వల్ల కంటిచూపు తగ్గినప్పుడు, కోల్పోయినప్పుడు దానిని పునురుద్ధరించడంలో నాన్ ఇన్వేసివ్( non-invasive)కానటువంటి చికిత్సల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు.
































