డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తేనే మన చేతిలోకి డబ్బు వస్తుంది. కూలీ పనికి వెళ్లే వారి దగ్గరి నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే అపర కుబేరుల వరకు అంతా పని చేస్తేనే సంపాదన చేతికి వస్తుంది.
ఒక్క రోజు పని మానేసినా దాని ప్రభావం సంపాదనపై పడుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ ఆటో డ్రైవర్ మాత్రం ఏ పనీ చేయకుండానే లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు.
తనతోటి డ్రైవర్లంతా రోజంతా ఎండనక, వాననకా.. రాత్రీ, పగలనే తేడా లేకుండా రోడ్లపై తిరుగుతుంటే.. అతడు మాత్రం ఓ చోట ఆటోను ఆపుకునే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎలాంటి పెట్టుబడి కూడా పెట్టకుండానే నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అసలే పనీ చేయకుండా అతడికి డబ్బెవరు ఇస్తున్నారు, ఆయన కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేశరాజధాని ఢిల్లీకి చెందిన అబ్దుల్ సామీ ఓ సాధారణ ఆటో డ్రైవర్. తన వద్ద ఆటో తప్ప ఏమీ లేదు. పెద్దగా చదువు కూడా లేకపోవడంతో ఉద్యోగం చేసే ఆలోచన లేదు. అలా అని వ్యాపారం చేద్దామన్నా పెద్దగా డబ్బులు కూడా లేవు. అందుకే తనకు వచ్చిన డ్రైవింగ్‌నే నమ్ముకుని జీవితాన్ని సాగిస్తున్నాడు. ముఖ్యంగా ఆటోను నడుపుకుంటూనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇన్నాళ్లూ ఇదే పని చేయగా.. గత కొంత కాలం కిందటే ఇతడికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. అదే ఇతడి జీవితాన్ని మార్చేసింది.
అలా అని ఇతడేదో వ్యాపారం చేస్తున్నాడనో, ఇన్వెస్టుమెంట్లు పెడుతూ కోట్లు సంపాదిస్తున్నాడని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకుంటే అబ్దుల్ సామీ అవేవీ చేయట్లేదు. కేవలం న్యూ ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ ముందు తన ఆటోను నిలుపుకుని కూర్చుంటున్నాడు. అక్కడకు ఇంటర్వ్యూ కోసం వచ్చే వారికి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా అక్కడకు వచ్చే వారు లగేజీతో రాగా.. సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. దీంతో వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడాన్ని అబ్దుల్ సామీ ఓసారి గుర్తించాడు.
దీంతో లోపలికి వెళ్లే వారిని పిలిచి తన ఆటోలో లగేజీ పెట్టుకోవాలని సూచించాడు. కానీ అందుకోసం తనకు రూ.1000 ఛార్జి చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అంతదూరం వెళ్లి ఇంటర్వ్యూకు వెళ్లకుండా ఉండలేని ప్రజలు అతడి వద్ద బ్యాగులను పెట్టుకోవడం ప్రారంభించారు. దీంతో ఆటో నడపడం మానేసి అబ్దుల్ సామీ.. దీన్నే తన పనిగా మార్చుకున్నారు. ఇలా రోజూ అక్కడకు 20 నుంచి 30 మంది కస్టమర్లు వస్తుండగా.. ఈ ఆటో డ్రైవర్ 20 వేల నుంచి 30 వేల రూపాయలను సంపాదిస్తున్నాడు. ఇలా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు కూర్చునే డబ్బులు పొందుతున్నాడు.
అయితే ఇటీవలే రాహుల్ రూపానీ అనే ఓ వ్యక్తి వీసా కోసం అక్కడకు ఇంటర్వ్యూకు వెళ్లగా.. ఈ విషయాన్ని గుర్తించాడు. ముఖ్యంగా తన బ్యాగును సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో.. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అబ్దుల్ సామీ అతడిని పిలిచాడు. తన వద్ద బ్యాగు పెట్టుకుని లోపలికి వెళ్లాలని.. అందుకోసం తాను రూ.1000 ఛార్జీ చేస్తానని అన్నాడు. చాలా దూరం నుంచి వెళ్లిన తాను ఇంటర్వ్యూకు కచ్చితంగా అటెండ్ కావాల్సి ఉండగా.. వెయ్యి రూపాయలు ఇచ్చి బ్యాగు అతడి వద్ద పెట్టాడు. అలాగే తానొక్కడే కాకుండా మరికొంత మంది కూడా ఇలాగే అతడి వద్ద లగేజీలు పెట్టుకోవడం గమనించాడు రాహుల్ రూపానీ. ఇదే విషయమైన అబ్దుల్ సామీని అడగ్గా.. అతడు కూడా నిజం చెప్పాడు. ఇలాగే ప్రతిరోజూ తాను డబ్బులు సంపాదిస్తున్నట్లు వివరించాడు.
ఇలా ఒకే చోట కూర్చుని నెలకు రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల సంపాదిస్తుండడంతో.. ఆశ్చర్యపోయిన రూపానీ ఈ విషయాన్ని రెడ్డిట్ వేదికగా వెల్లడించాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. అందరి చూపు ఈ ఆటో డ్రైవర్‌పై పడింది. ఎలాంటి చదువు సంధ్యలు లేకపోయినా.. స్మార్ట్ వర్క్‌తో లక్షలు సంపాదించడం చాలా గ్రేట్ అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
































