వాయుగుండం వెళ్లిపోయిన తర్వాత ఏపీ, తెలంగాణలో వేడి పెరిగింది. రుతుపవనాల జోరుకి బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు వాతావరణం క్రమంగా మారుతోంది. ఇవాళ ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం తయారవుతోంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి అంటే గురువారం నుంచి శనివారం వరకూ.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని తన తాజా బులిటెన్‌లో చెప్పింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందనీ, ఉరుములు, మెరుపులూ వస్తాయనీ, పిడుగులు కూడా పడతాయని చెప్పింది. తెలంగాణకి మాత్రం ఎలాంటి వర్ష సూచనా ఇవ్వలేదు.
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలంగాణకి వర్ష సూచన ఉంది. గురువారం తెలంగాణపై రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 5 తర్వాత హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. అర్థరాత్రి వరకూ ఈ పరిస్థితి ఉంటుంది. ఉత్తర తెలంగాణలోని ఒకట్రెండు చోట్ల సాయంత్రం తేలికపాటి వర్షం పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇవాళ రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం వేళ విశాఖపట్నం పరిసరాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. అలాగే కోస్తాలో ఒకట్రెండు చోట్ల జల్లులు పడొచ్చు. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఐతే మేఘాలు, గాలి కారణంగా.. కొంత ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుంది.
గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 21 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్లుగా ఉంటుంది. గాలులన్నీ అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు వస్తూ.. అక్కడి నుంచి ఏపీ, తెలంగాణపైకి వచ్చి, చివరకు మయన్మార్‌కి వెళ్తున్నాయి.
ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఎండ ఉన్నా.. మరీ ఎక్కువ ఇబ్బందిగా అనిపించదు. ఏపీలో మాత్రం ఎండలు భగ్గుమంటాయి. ఉష్ణోగ్రత 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీర ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత కూడా ఉంటుంది.
తేమ తెలంగాణలో 50 శాతం ఉంటే, ఏపీలో 40 శాతమే ఉంటుంది. రాత్రివేళ తేమ తెలంగాణలో 81 శాతం ఉంటే, ఏపీలో 72 శాతమే ఉంటుంది. ఈ కారణంగానే.. ఇవాళ తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐతే.. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదు.
ఏపీ, తెలంగాణకు నైరుతీ రుతుపవనాలు వచ్చి వారమైంది. మరి ఇంకా ఎందుకు వర్షాలు పడట్లేదు అనే ప్రశ్న మనకు వస్తుంది. దీనికి ప్రధాన కారణం.. గాలులు చెల్లా చెదురు అవ్వడమే. మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన రుతుపవనాలను బంగ్లాదేశ్‌కి వెళ్లిన వాడుగుండం లాగేసింది. దాంతో.. చల్లదనం మొత్తం ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్, మయన్మార్‌కి వెళ్లిపోయింది. అదే సమయంలో రోహిణీ కార్తె వేడి పెరిగింది.
5 రోజుల గ్యాప్ తర్వాత వాతావరణం ఇప్పుడు మళ్లీ చల్లబడుతోంది. ఇలాంటి సమయంలో రుతుపనాలు జోరు పెంచితే.. వర్షాలు కురిసే అవకాశాలు మెరుగవుతాయి. నిజానికి రైతులు.. ఈ వానలపై ఆశతో విత్తనాలు వేసేందుకు సిద్ధపడ్డారు. కానీ.. వారికి నిరాశ కలిగిస్తూ.. అనుకున్న స్థాయిలో వానలు కురవలేదు. ఐతే, భూమధ్య రేఖ ప్రాంతం, ఆగ్నేయ ఆసియాలో మేఘాలు ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల వచ్చేవారం వర్షాలు కురిసే అవకాశాలు మెరగువుతాయి అనుకోవచ్చు.
































