ఎమ్మెల్సీ నియామకంపై ప్రొఫెసర్ కోదండరాంకు ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారానికి బ్రేక్ ఇచ్చింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకం ఆపాలంటూ దాసోసు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్ ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు యథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగ ప్రతిపాదించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే వీటిని గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపారు. రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నవాళ్లకు ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వలేనంటూ తిరస్కరించారు. దీంతో అప్పుడే వీళ్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదిస్తూ పంపింది. దీంతో ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నేపథ్యం కారణంగా తమను ఆపివేశారని, ఇప్పుడు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఎలా కేటాయించారంటూ సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.