బక్రీద్ వేళ ముస్లీంలను టార్గెట్ చేసిన పవన్ .. షాకింగ్ ట్వీట్

న్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి. కొంతకాలం ముందు వరకు పవన్ మాటల్లో, స్పీచ్ లలో గమనిస్తే కమ్యూనిజం భావాలు, సర్వమతాలను గౌరవిస్తాను అంటూ తెగ ఊదరగొట్టేవారు.


ఏకంగా తన భార్య సైతం క్రిస్టియన్ అని.. ప్రార్ధన కూడా చేశానని అన్నారు. అలానే ముస్లీం సోదరులు అంటే గౌరవం ఉందని.. ఎప్పుడూ అండగా ఉంటానని వ్యాఖ్యానించేవారు. కులమతాలు అనే ప్రస్తావన లేకుండా.. అందరికీ సమన్యాయం జరగాలని మాట్లాడిన సందర్భాలు ఎన్నో చూశాం.

సినిమాల పరంగా కంటే పవన్ ని వ్యక్తిగతంగా ఇష్టపడే వారు ఎక్కువమంది ఉంటారనడంలో సందేహం లేదు. కమ్యూనిజం భావజాలం, సమన్యాయం అంటూ చెప్పే ఆయన మాటలకు ఎంతో మంది యువత బాగా కనెక్ట్ అయ్యారు. కానీ అదంతా అప్పుడండీ.. ఇప్పడు మారిపోయాను అన్నట్టుంది పవన్ తీరు.

ఎన్నికల ముందు తన కులాన్ని గౌరవిస్తాను అంటూ తన వర్గాన్ని ఆకర్షించడం మొదలుపెట్టారు పవన్. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక హిందూ సమాజమే లక్ష్యంగా.. సనాతన హిందూ అంటూ కుండబద్దలు కొట్టినట్టు స్టేట్ మెంట్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చి.. యాత్ర కూడా ప్రారంభించారు. ఇక తిరుమల లడ్డూ ఇష్యూలో అయితే పవన్ చేసిన హడావిడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అలా ఆ రేంజ్ లో మారిపోయిన పవన్ ఇప్పుడు ఏకంగా పొత్తులో ఉన్న బీజేపీ కోసం ముస్లీం వర్గాలను టార్గెట్ చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ముస్లీంలు పవిత్రంగా జరుపుకునే పండుగల్లో బక్రీద్ కూడా ఒకటి. కానీ ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా బక్రీద్ పండుగ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. గోవులను పవిత్రంగా పూజించే సంస్కృతి ఉన్న సమాజం మనదని.. అటువంటి గోవులను వధించేందుకు చట్టాలు అంగీకరించవని ఆ పోస్టులో రాసుకొచ్చారు. గో మాతలను సంరక్షించుకొనే దిశగా ఉన్న చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరమని పిలుపునిచ్చారు.

అంతే కాకుండా గో సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. బక్రీద్ తరుణంలో కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉందని.. అందుకే పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వెల్లడించారు. పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయనున్నారని.. వారికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.

అయితే ఈ ట్వీట్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వర్గం సానుకూలంగానే స్పందిస్తున్నప్పటికీ.. మరో వర్గం మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ తరహా ట్వీట్ ఈ సమయంలో చేస్తే మత విద్వేషాలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.