‘అన్నదమ్ములు.. స్మార్ట్‌ సిటీ పేరుతో 70 వేల మందిని భలే మోసం చేశారు’

ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారనే నానుడిని ఈ ఇద్దరు అన్నదమ్ములు నిజం చేశారు. నమ్మకమే పెట్టుబడిగా బిజినెస్‌ను ప్రారంభించి అతి తక్కువ సమయంలో 70వేల మందిని ముంచారు.


సుమారు 3వేల కోట్ల మేర టోపీ పెట్టారు.

రాజస్థాన్‌ రాష్ట్రం సికార్ జిల్లాకు చెందిన సుభాష్ బిజరణి,రణవీర్ బిజరణిలు అన్నదమ్ములు. వారిలో సుభాష్‌ రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌. రణవీర్‌ ఏం చేసేవారని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వీళ్లిద్దరికి రాత్రికిరాత్రే కోటీశ్వరులవ్వాలనే అత్యాస పుట్టింది. ఇందుకోసం ఏం చేయాలి? జనాల్ని ఎలా మోసం చేయాలో ప్లాన్‌ చేసుకున్నారు.

ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌పై కన్ను
అప్పుడే వీళ్లద్దరూ ప్రస్తుతం కేంద్రం,గుజారాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశంలోని తొలిసారి నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌పై కన్నుపడింది. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దొలేరా స్మార్ట్‌ సిటీకి ఏమాంత్రం సంబంధం లేని 110కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లో 2014లో ప్లాటును కొనుగోలు చేశారు. మీరు కూడా ధొలేరా స్మార్ట్‌ సిటీలో ప్లాటు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఇందుకోసం మా నెక్సా ఎవర్‌గ్రీన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఓ డమ్మీ కంపెనీని ప్రారంభించారు.

విలువైన బహుమతుల్ని ఎరగా వేసి
నెక్సా ఎవర్‌గ్రీన్‌ కంపెనీ పేరుతో కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ ధోలేరా స్మార్ట్ సిటీ ఒరిజినల్‌ ఫొటోలతో ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా 70,000 మందిని మోసం చేసి, ఏకంగా రూ.2,676 కోట్ల మేర డబ్బు వసూలు చేశారు. ధొలేరాలో ప్రాజెక్టులు ఉన్నాయంటూ ఫేక్ ఫొటోలు చూపిస్తూ, ప్రజలను బిల్డింగులు, ప్లాట్లు, హై రిటర్న్స్ పేరుతో ఆకర్షించారు. అంతేకాదు ఇతరులను రిఫర్ చేస్తే లాప్‌టాప్‌లు, బైకులు, కార్లు అంటూ బహుమతులు ఆశచూపించారు. రెఫరల్ ప్రోగ్రామ్ పేరిట లెవెల్ వైజ్ కమిషన్లు, ఆదాయం అంటూ కోట్ల రూపాయలను ప్రజల నుండి సేకరించారు. ఈ మొత్తం స్కామ్‌లో దాదాపు రూ.1,500 కోట్లు కమిషన్ల రూపంలో పంపిణీ చేశారు.

ఆస్తుల్ని పోగేసి చివరికి
ఆ తర్వాత జనాల్ని మోసం చేయగా వచ్చిన వేల కోట్లతో లగ్జరీ కార్లు, హోటళ్లు, గోవాలో 25 రిసార్టులు, రాజస్థాన్‌లో మైన్స్‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.250 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారు. మిగిలిన డబ్బును 27 షెల్ కంపెనీలకు మళ్లించారు. చివరికి కంపెనీ బోర్డు తిప్పేశారు. పరారయ్యారు. కంపెనీ కార్యాలయాలు మూసివేయడంతో పెట్టుబడి దారుల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా నిందితుల జాడ తెలియలేదు. తాము మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జోధ్‌పూర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈడీ సైతం 25 చోట్ల సోదాలు నిర్వహించడంతో అన్నదమ్ములు భాగోతం వెలుగులోకి వచ్చింది.

ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టు
ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం కలసి నిర్మిస్తున్నాయి. దేశంలోని మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఢిల్లీ కంటే రెండింతలు పెద్దది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అనేక విదేశీ కంపెనీల కార్యాలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2042 నాటికి వినియోగంలోకి రానుంది. నిజమైన ధొలేరా ప్రాజెక్టును అడ్డుగా పెట్టుకొని వేల మందిని మోసం చేసిన ఈ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ముందుగా ఇలాంటి స్కామ్స్‌కు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.