నిధులు మంజూరు చేయడానికి రూ.30 వేలు డిమాండ్.. ఏసీబీ ఎంట్రీతో సీన్ సితార్

రూ.30 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు ఓ ప్రభుత్వ అధికారి. ప్రకాశంజిల్లా మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు ఓ కాంట్రాక్టర్‌కు నిధులు మంజూరు చేసేందుకు రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించగా రంగంలోకి దిగిన అధికారులు లంచం తీసుకుంటుండగా శ్రీనివాసరావును పట్టుకున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో అవినీతి వేళ్ళూనుకుని పోయింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు చేయాలంటే లంచాలు ఇస్తేకాని కొంతమంది అధికారులు పనిచేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా తమ బిల్లులు ఆగిపోతాయన్న భయంతో ఎవరూ అధికారుల అవినీతిని బయట పెట్టేందుకు ముందుకురావడం లేదు. అయితే మార్కాపురం ఇరిగేషన్‌ శాఖలోని అంతులేని అవినీతిపై విసిగివేసారిన ఓ కాంట్రాక్టర్‌ ధైర్యం చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఇరిగేషన్‌ శాఖ అవినీతి బాగోతం బట్టబయలైంది.


ప్రకాశంజిల్లా మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ గతంలో 30 లక్షలు విలువ చేసే రోడ్డు పనులు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులను తన శాఖకు చెందిన ఉన్నతాధికారుల చేత మంజూరు చేయించాలని సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు దగ్గరకు వచ్చారు. అయితే ఆ పని చేసేపెట్టేందుకు శ్రీనివాస్‌రావు కాంట్రాక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి నుంచి 30 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కాగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

బాధిత కాంట్రాక్టర్‌ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం రంగంలోకి దిగి శ్రీనివాసరావు పై నిఘా ఉంచారు. అనుకున్న ప్రకారం సోమవారం మార్కాపురంలోని తన కార్యాలయంలో కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ఏసీబీ డిఎస్పి ఎస్. శిరీష ఆధ్వర్యంలో పలువులు ఏసిబి సిఐలు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అలాగే పట్టుబడ్డ శ్రీనివాసరావుకు సంబంధించిన గదిలో సోదాలు కూడా చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.