Tax Saving Schemes: పన్ను ఆదా చేసే పథకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? వాటిల్లో బెస్ట్ ఇవే..

www.mannamweb.com


పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించే పన్ను మొత్తంలో చాలా వరకూ ఆదా చేసుకొనే వెసులుబాటు ఉంది. ఆదాయ పన్ను చట్టమే ఆ వెసులుబాటు కల్పించింది. అయితే అందుకోసం మీరు పాత పన్ను విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది.
ఒక వేళ మీరు పాత పన్ను విధానంలో ఉంటే అనేక పథకాలు పన్ను ఆదా చేసేవి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ శాతం మంది మాత్రం ప్రయోజనం పొందే వీలుంటుంది. ప్రతి నెలా, లేదా త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన ఆయా పథకాల్లో మీరు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి పథకానికి కొంత సమయం లాకిన్ సమయం కూడా ఉంటుంది. మరికొన్నింటిలో రిస్క్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుదారులు వారి ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలను బేరీజు వేసుకుంటూ ఆయా పథకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), ఈక్విటీ లింకెడ్ మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న బెస్ట్ పన్ను ఆదా పథకాలను మీకు అందిస్తున్నాం.

నేషనల్ పెన్షన్ స్కీమ్..

మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ రిటైర్ మెంట్ స్కీమ్లలో ఇదీ ఒకటి. దీనిలో రాబడి 8.16శాతం వరకూ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తూనే దీనిలో పెట్టుబడులు పెట్టొచ్చు. 60ఏళ్ల తర్వాత వాటని పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ(1)కింద రూ. 1.5లక్షలు, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ. 50వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు. అలాగే సెక్షన్ 80సీసీడీ(2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే ఉద్యోగి వేతనంలో 10శాతం క్లయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో పెట్టే పెట్టుబడులను ఈక్విటీలకు కూడా బదలాయించుకోవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్..
ఈ పథకంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. కానీ రాబడి మొత్తం పన్ను పరిధిలోకి వెళ్తుంది. దీనిలో కూడా లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. రాబడి మొత్తం 7నుంచి 8శాతం మధ్య ఉంటుంది.

బీమా పథకాలు..

వాస్తవానికి ఇన్స్యూరెన్స్ పథకాలు ట్యాక్స్ సేవింగ్స్ కోసం చేసేవి. అవి జీవిత, ఆరోగ్య పరిరక్షణ కోసం వచ్చేవి. అనుకోని విపత్తుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఇవి ఉపయోగపడతాయి. జీవిత బీమా పథకాలు దురదృష్టవశాత్తూ వ్యక్తులు మరణిస్తే బీమా పరిహారం ఆ వ్యక్తి కుటుంబానికి అందుతుంది. దీనిలో చాలా రకాల పాలసీలు ఉన్నా టెర్మ్ ప్లాన్లు మెరుగైనవి. ఈ టెర్మ్ ప్లాన్లపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిలో రాబడులు 5 నుంచి 6శాతం ఉంటుంది. లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్య బీమా పథకాల్లో 60ఏళ్ల లోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద రూ. 25,000, 60 ఏళ్లు పైబడిన వారికైతే రూ. 50,000 వరకూ పన్ను ఆదా చేసుకునే వెలుసుబాటు ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్..

దీనిలో రాబడిపై కూడా పన్ను పడదు. ఈ పథకం కాల వ్యవధి 15ఏళ్లు ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.1శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. దీనిలో పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. బ్యాంకులు పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించొచ్చు.

రిటైర్ మెంట్ ఫండ్స్..

రిటైర్ మెంట్ ఫండ్స్ ఈక్విటీతో పాటు డెట్ సాధనాల్లోనూ పెట్టుబడులు పెడతాయి. దీంతో అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. పలు ప్రైవేటు సంస్థలు ఈ రిటైర్ మెంట్ ఫండ్స్ ను నిర్వహిస్తాయి. సెక్షన్ 80సీ కింద ఈ పెట్టుబడులపై రూ.1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. దీనిలో రాబడి ఐదేళ్లలో 7 నుంచి 9శాతం ఉంటుంది. లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన..

ఆడబిడ్డల తల్లిదండ్రులకు వరం ఈ పథకం. ప్రస్తుతం దీనిలో వడ్డీ రేటు 8.2శాతం ఉంటుంది. లాకిన్ పీరియడ్ 18ఏళ్లు. ఒక ఆర్థిక సంవత్సంరలో రూ. 1.5లక్షల వరకూ దీనిలో పెట్టుబడులు పెట్టొచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్..

వృద్ధులు అంటే 60ఏళ్ల నిండిన వారికి ఇది మంచి ఆప్షన్. దీనిలో రాబడి అత్యధికంగా 8.2శాతం ఉంటుంది. కనీస లాకిన్ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. తర్వాత పొడిగించుకునే అవకాశం ఉంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5లక్షల వరకూ పన్ను ప్రయోజనం పొందొచ్చు. ప్రతి త్రైమాసికానికి వడ్డీ చెల్లింపులు
ఉంటాయి.

ఈఎల్ఎస్ఎస్..

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) లో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందిస్తుంది. దీనికి లాకిన్ పీరియడ్ మూడేళ్లు ఉంటుంది. కనీసం ఐదేళ్ల కాలానికి పెట్టుబడి పెడితే రిటర్న్ లు 17శాతం వరకూ ఉంటాయి. దీనిలో కూడా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపును పొందొచ్చు.