ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు రాజకీయ వ్యూహాల పైన ఫోకస్ చేసాయి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది.
ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఏడాది కాలం పూర్తి కావటంతో రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్త ను ఖరారు చేసినట్లు సమాచారం. 2019, 2024 ఎన్నికల్లోనూ వైసీపీ కోసం ఐ ప్యాక్ పని చేసింది. సారధులు మాత్రం మారారు. ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. దీంతో, జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక పైన ఆసక్తి నెలకొంది.
కీలక పరిణామాలు
2019 ఎన్నికల ముందే ప్రశాంత్ కిశోర్ తో వైసీపీ ఒప్పందం చేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ నాడు వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. జగన్ పాదయాత్ర.. పార్టీలో చేరిక లు.. ఎన్నికల హామీలు.. ప్రచార తీరు వెనుక ఉండి నడిపించారు. ఆ ఎన్నికల్లో జగన్ ఏకంగా 151 సీట్లు గెలిచారు. అయితే.. తరువాత మారిన సమీకరణాలతో 2019 లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తరువాత తాను ఈ విధుల నుంచి దూరంగా ఉంటానని వెల్లడించారు. దీంతో, ప్రశాంత్ టీం కే చెందిన ఋషి రాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఐ ప్యాక్ టీం అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు వైసీపీ కోసం పని చేసింది. కానీ, 2024 ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి.
జగన్ చర్చలు
2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీ లోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిశోర్ నాడు చంద్రబాబును కలిసారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్ లోనే మకాం వేసి జగన్ ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిశోర్ అందించి .. విజయం లో కీలక పాత్ర పోషించారు. మద్యం, లాండ్ టైటిల్ యాక్ట్, పెన్షన్ల పెంపు, వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిశోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం. కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రశాంత్ కిశోర్ ను కలిసారు. ప్రస్తుత రాజకీయాల పైన చర్చించి సూచనలు.. సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీకి 2024 ఎన్నికల ముందు నుంచి పని చేస్తున్న రాబిన్ శర్మ టీం షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది.
కొత్త వ్యూహకర్త
ఇక, ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్.. ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఐ ప్యాక్ లో ప్రశాంత్ కిశోర్ కు సహచరుడిగా పని చేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త తో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. 2029 ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఇక దశలో గతంలో పని చేసిన రిషి రాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగింది. దీని పైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పైన జగన్ పార్టీ ముఖ్యుల కు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ఎంత వరకు పార్టీకి మేలు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
































