‘మా గ్రామ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించేది లేదు. కార్పొరేట్ సంస్థల బస్సులు ఇక్కడికి రావద్దు’ అంటూ స్థానికులు తేల్చిచెప్పారు.
వచ్చిన బస్సులను వెనక్కి పంపించారు. మండలంలోని ఎల్లమ్మతండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. పిల్లలు లేరనే కారణంతో తండాలోని ప్రాథమిక పాఠశాల నాలుగేళ్లుగా మూతబడింది. బడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అంతా ఏకమై దాతలు, గ్రామస్తుల సహకారంతో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించారు. బడిని తిరిగి తెరిపించి 60 మంది పిల్లలను చేర్పించారు. ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతో స్కూల్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ల బస్సులను అనుమతించేది లేదని సోమవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం స్థానిక నాయకుడు సబావట్ శేఖర్ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రైబల్ టీచర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, పాఠశాల కమిటీ చైర్మన్ పద్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హున్నానాయక్, మాజీ సర్పంచ్లు చందు నాయక్, పద్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకున్న ఎల్లమ్మతండావాసులు



































