సండే కదా ఓ బిర్యానీ తిందామని తినేశాడు. కానీ మసాలా ఎక్కువైందో లేక ఇంకేకారణమో కానీ.. కడుపు ఉబ్బరం పెరిగి ఇబ్బందికరంగా ఉండటంతో డాక్టర్ ను కలుద్దామని ఆర్ఎంపీని కలిశాడు ఓ యువకుడు.
ఏ పర్లేదు తగ్గుతుంది. ఒక్క ఇంజక్షన్ ఇస్తే గ్యాస్ అంతా మాయం అవుతుందని చెప్పి ఒక సూది గుచ్చాడు. కానీ అదే సూది అతినికి శాపంలా మారి వెంటనే కుప్పకూలిపోయాడు. హైదరాబాద్ బొల్లారంలో జరిగిన ఈ ఘటన ఆందోళనకు గురిచేస్తోంది.
బొల్లారం రిసాల బజార్ లో నివాసముంటున్న విఘ్నేశ్వర అనే యువకుడు ఆదివారం (జూన్ 15) రాత్రి బిర్యానీ తినడంతో గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని స్థానిక ఆర్ఎంపి వైద్యుడిని సంప్రదించాడు. ఆర్.ఎం.పి వైద్యుడు వంశీ సమస్యను తెలుసుకుని ఇంజక్షన్ ఇవ్వడంతో ఇంటికి వచ్చిన జ్ఞానే జ్ఞానేశ్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే అతన్ని కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించగా ఆక్సిజన్ సపోర్టు లేకపోవడంతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆగ్రహానికి గురైన జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఆర్ఎంపీ వైద్యుడు వంశీ క్లినిక్ పై దాడికి యత్నించారు.
ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ మూలంగానే విఘ్నేశ్వర మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని, ఆర్ఎంపీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు వంశీకి వైద్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం మూలంగానే జ్ఞానేశ్వర్ మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
































