టీసీఎస్‌ కొత్త పాలసీ.. బెంచ్‌పై ఇక 35 రోజులు మాత్రమే

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇకపై ఏటా ప్రతి ఉద్యోగి 225 బిల్ల్‌డ్‌ బిజినెస్‌ డేస్‌ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది.


బెంచ్‌ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్‌ 12 నుంచి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు పనిచేయకుండా ఉండే సమయాన్ని తగ్గించడం, వర్క్‌ఫోర్స్‌ను సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చినట్లు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.

ఐటీ కంపెనీల్లో బిల్ల్‌డ్‌ డేస్‌ అంటే క్లయింట్‌ ప్రాజెక్ట్‌పై పని చేయాల్సిన రోజులు. ఇది ఏడాదికి 225 రోజులుగా టీసీఎస్‌ నిర్ణయించింది. అంటే ప్రతి ఉద్యోగి కనీసం అన్ని రోజులు ప్రాజెక్టులపై పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఏ ప్రాజెక్ట్‌పై పనిచేయకుండా ఖాళీగా ఉండే సమయాన్ని బెంచ్‌ పీరియడ్‌గా పేర్కొంటారు. ఇకపై 35 రోజులు మాత్రమే ఒక ఉద్యోగి బెంచ్‌ మీద ఉండాలి. దీర్ఘకాలం పాటు ఏ ఉద్యోగి ప్రాజెక్టుపై లేకుండా ఖాళీగా ఉండకూడదని కొత్త పాలసీ నిర్దేశిస్తోంది. అలా జరిగితే అతడి పారితోషికం, కెరీర్‌లో వృద్ధి, చివరికి ఉద్యోగ జీవితంపైనా ప్రభావం పడుతుందని కంపెనీ తన పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొంది.

    టీసీఎస్‌లో ఏ ప్రాజెక్ట్‌కు ఎవరు సరిపోతారు? ఎవరి నైపుణ్యాలు సరిపోతాయి? వంటివి రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ (RMG) చూస్తుంది. దీనికి గ్లోబల్‌ హెడ్‌గా ఉన్న చంద్రశేఖరన్‌ రామ్‌కుమార్‌ నిర్ణయానికి అనుగుణంగా ఈ పాలసీ రూపుదిద్దుకుంది. అసోసియేట్‌కు ఏ ప్రాజెక్ట్‌నూ కేటాయించని సందర్భంలో తనకు సరిపడే ప్రాజెక్ట్‌ అప్పగించేలా ఎప్పటికప్పుడు యూనిట్‌/ రీజనల్‌ ఆర్ఎంజీతో సంప్రదింపులు జరపడం వారిదే బాధ్యత అని పాలసీలో పేర్కొన్నారు. బెంచ్‌పై ఉన్న ఉద్యోగులు సంస్థ అందిస్తున్న ఐఎవాల్వ్‌, ఫ్రెస్కో ప్లే, వీఎల్‌ఎస్‌, లింక్డిన్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకొని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఆర్‌ఎంజీ నిర్దేశించిన సెషన్లకు హాజరవ్వాలి. బెంచ్‌పై ఉండేటప్పుడు ఆఫీసుకు రావడం తప్పనిసరి. వర్క్‌ఫ్రమ్‌ ఆఫీసు నుంచి మినహాయింపులు, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ వంటివి వర్తించవు. దీర్ఘకాలం పాటు ఏ ప్రాజెక్టూ కేటాయించని సందర్భంగా టీసీఎస్‌ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవచ్చని ఈ పాలసీ చెబుతోంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.