కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము అందించే దాదాపు అన్ని సేవలను ఆధార్‌తో లింక్ చేస్తున్నాయి. గుర్తుంపుతో పాటు ఇంకా చాలా పనులకు అధార్ అవసరం అవుతోంది.
ఈ క్రమంలో ఆధార్ కార్డులో తప్పులుంటే చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఆధార్‌ను అప్డేట్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి.. క్యూలో నిలబడి మరీ అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ఇకపై అలా ఆధార్ కేంద్రాల్లో ప్రయాస పడే పని ఉండదు. ఇంటినుంచే సులభంగా ఆధార్‌లో తప్పులు సరిచేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.
రానున్న కొద్ది వారాల్లో అప్డేట్ కోసం ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మిగతా డాక్యుమెంట్లు సబ్మిట్ చేసే పని ఉండదు. క్యూఆర్ కోడ్ ఆధారిత యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ ఆధార్‌ను పూర్తిగా లేదా మాస్క్డ్ వెర్షన్‌లో షేర్ చేయవచ్చు. కేవలం బయోమెట్రిక్ కోసమే ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. నవంబర్ వరకు ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆదార్ అప్డేట్‌కు.. బర్త్ సర్టిఫికెట్, టెన్త్ క్లాస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, PAN, PDS, MNREGA వంటి డేటాబేస్‍ల నుంచి వివరాలు తీసుకుంటారు. దీని ద్వారా ప్రజలు ఆధార్‌ను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఫలితంగా నకిలీ డాక్యుమెంట్లతో ఆధార్ పొందే అవకాశం ఉండదు.
ఈ కొత్త విధానం కోసం ఓ యాప్‌ను తయారు చేసినట్లు UIDAI సీఈఓ భువనేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే ఉన్న లక్ష మెషీన్లలో 2,000 మెషీన్లు ఈ కొత్త టూల్‌కు మారాయని తెలిపారు. “వేలిముద్రలు, ఐరిస్ ఇవ్వడం తప్ప మిగతా అన్నీ ఇంట్లో కూర్చొనే చేయవచ్చు” అని ఆయన తెలిపారు. అడ్రస్, ఫోన్ నంబర్లు, పేరు మార్పు, పుట్టిన తేదీలో తప్పులు సరిదిద్దడం వంటివి కూడా ఇంటి నుంచే చేసుకోవచ్చని వెల్లడించారు.
క్యూఆర్ కోడ్ ద్వారా మొబైల్ టు మొబైల్‌కు లేదా యాప్ టు యాప్ ఆధార్ షేర్ చేయడం వల్ల ఆధార్ దుర్వినియోగం జరగకుండా చూడవచ్చు. హోటళ్లలో చెక్ ఇన్ చేయడానికి, రైలులో గుర్తింపు ధృవీకరణకు ఇది ఉపయోగపడుతుంది. “మీ డేటాపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. మీ అనుమతితోనే డేటాను షేర్ చేయవచ్చు” అని భువనేష్ కుమార్ అన్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో సబ్-రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీని ద్వారా మోసాలు జరగకుండా అడ్డుకోవచ్చు. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించాలని UIDAI రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తోంది.
ఈ విధానం అమలు చేయడానికి CBSE, ఇతర పరీక్ష బోర్డులతో UIDAI చర్చలు జరుపుతోంది. పిల్లల బయోమెట్రిక్, ఇతర వివరాలను అప్‌డేట్ చేయాలని కోరుతోంది. పిల్లలకు ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్య, అలాగే 15 నుంచి 17 సంవత్సరాల మధ్య ఆధార్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మొదటి అప్‌డేట్ (ఐదు నుంచి ఏడు సంవత్సరాల మధ్య పిల్లలకు) కోసం ఎనిమిది కోట్ల వివరాలు, రెండో అప్‌డేట్ కోసం పది కోట్ల మంది అప్డేట్ వివరాలు మిస్ అయ్యాయి. వీటిని పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఆధార్ వాడకం తప్పనిసరి కాని సెక్యూరిటీ ఏజెన్సీలు, హోటళ్లు వంటి సంస్థల్లో కూడా తప్పనిసరి చేసేందుకు UIDAI వారితో సంప్రదింపులు జరుపుతోంది.
కొత్తగా తీసుకువస్తున్న ఈ విధానం వల్ల ఆధార్ సెంటర్లకు వెళ్లకుండానే చాలా పనులు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, మోసాలు కూడా తగ్గుతాయి. ఆధార్ కార్డును సులభంగా, సురక్షితంగా ఉపయోగించుకునేందుకు UIDAI అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి ఆధార్ కార్డులోని వివరాలను ఎవరితో పడితే వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయవచ్చు. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది.
































