కుప్పం మహిళకు ఆర్థిక సాయం ప్రకటన.. పిల్లల చదువుకు హామీ

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలి శిరీషతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.


ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. ఇటువంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు.

మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని సీఎం అన్నారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. వారిని బాగా చదివించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని.. ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిరీష పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని శిరీషకు ఫోన్‌లో సీఎం హామీ ఇచ్చారు. ఘటన, తదనంతర పరిణామాల పై తనకు నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అందుబాటులో ఉండి అవసరమైన సాయం పూర్తిగా అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.