గృహానికి ఎదురుగా నిలువయిన వీధి వుంటే గృహానికి ‘వీధిపోటు’ వున్నట్లు గ్రహించాలి.సాధారణంగా ఎదురుగా వున్న వీధి ఇంటివరకూ వచ్చి ఆగిపోవటమో లేక అటు ఇటుగాని ఏదైనా ఒకవైపుగానీ విస్తరించటమో జరుగుతుంది.
అన్ని వీధిపోట్ల ఫలితాలు ఒకే మాదిరి ఉండవు. కొన్ని మంచి ఫలితాలను కలుగజేస్తే మరిన్నొ చెడు ఫలితాలను కలుగజేస్తాయి.
పశ్చిమ నైరుతి వీధిపోటు
ఇలాంటి వీధిపోటు ఆ గృహంలో నివసించే పురుషుల మీద చెడు ప్రభావం కలిగిస్తుంది.
కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు, శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ప్రమోషన్లు, చేతికందాల్సిన డబ్బు, రావలసిన మంచి పేరు మొదలైనవి చెదరిపోతుంటాయి.
దక్షిణ నైరుతి వీధిపోటు
ఆ గృహంలో నివసించే స్త్రీల మీద ముఖ్యంగా యజమానురాలి పైన చెడు ఫలితం చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లోపించటం, స్త్రీ అనారోగ్యం పాలవటం, అవమానాల పాలవటం, గౌరవప్రదమైన స్థానం పొందలేక మథనపడటం, అనుకున్న విధంగా ఇంటిని తీర్చిదిద్దలేక అభాసు పాలవుతుండాననే భావన, ఏదో మంచి చేయాలనే తలంపుతో మొదలు పెట్టిన పని వక్రించి వేదనకు గురి కావటం జరుగుతుంటుంది.
ఉత్తర వాయువ్య వీధిపోటు
గృహానికి ఉత్తర వాయువ్యంలో ఎదురుగా వీధి వుంటే దాన్ని ఉత్తర వాయువ్యపు వీధిపోటు అంటారు.
ఇలాంటి వీధిపోటు వుండటం వల్ల కూడా స్త్రీలు దాని దుష్ప్రభావానికి లోనవుతారు. ముఖ్యంగా ఇంట్లో వుండే యువతుల మీద దీని ప్రభావం ఉంటుంది.
చదువుల మీద శ్రద్ధాసక్తులు సన్నగిల్లటం, పెళ్లి సంబంధాలు త్వరగా కుదరకపోవడం, వెతుక్కుంటూ వచ్చిన కళ్యాణ ఘడియలు అకస్మాత్తుగా గగనకుసుమాలవటం, జీవితం మీద ఓ విధమైన తేలిక భావాన్ని, వయసుకు మించిన వేదాంతాన్ని, వ్యక్తుల పట్ల నిర్లక్ష్యాన్ని కనబరుస్తుంటారు.
ఇలాంటి వీధిపోటున్న ఇంటికి ప్రధాన ద్వారం కూడా వీధికి ఎదురుగా వుంటే దుష్పరిణామాలు ఎక్కువగా ఉంటాయి.
పశ్చిమ వాయువ్య వీధిపోటు
గృహానికి పశ్చిమ వాయువ్యానికి ఎదురుగా వీధి వచ్చి కలిస్తే దాన్ని పశ్చిమ వాయువ్యపు వీధిపోటుగా గుర్తించాలి.
ఈ వీధిపోటు శుభప్రదమైంది. ముఖ్యంగా ఆ ఇంట్లో నివసించే పురుషులకు, ఇంటి యజమానికి ఈ వీధిపోటు వల్ల శుభ ఫలితాలు కలిసివస్తాయి.
పది మందిలో మంచి గుర్తింపు లభిస్తుంది. నాయకత్వపు లక్షణాలు వస్తాయి.
తూర్పు ఈశాన్య వీధిపోటు
పశ్చిమ వాయువ్యపు వీధిపోటు నాయకత్వాన్ని తెచ్చిపెడితే తూర్పు ఈశాన్యపు వీధిపోటు పురుషులకు సర్వాధికారాలు అంటగడుతుంది.
గృహానికి తూర్పు ఈశాన్యానికి ఎదురుగా వీధి వున్నట్లయితే దాన్ని ఈశాన్యపు వీధిపోటుగా గుర్తించాలి.
ఈ వీధిపోటు ఆ గృహంలో నివసించే పురుషుల మీద, ఆ గృహ యజమానికి కుటుంబానికి సంబంధించిన పురుషుల మీద గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.
ఈ ఇంట్లోని వ్యక్తులు స్వాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా వుండటమే కాక కోరింది సాధించుకోవడం, కష్టపడి తమ చేయిని ఎప్పుడూ పై చేయిగా నిరూపించుకోవడం అలవడి ఉంటుంది.
దక్షిణ ఆగ్నేయ వీధిపోటు
గృహానికి దక్షిణ ఆగ్నేయ మూలకు ఎదురుగా వీధి వచ్చి కలిస్తే దానిని ‘దక్షిణ ఆగ్నేయ వీధిపోటు’ అనిగుర్తించాలి.ఇటువంటి వీధిపోటు శుభదాయకమవుతుంది.ఆ ఇంట్లో నివసించే ‘ఓనర్’కు కూడా మానసికప్రశాంతత వుంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణంకనిపిస్తుంది.తరుచూ శుభకార్యాలు జరుగుతుంటాయి.
బంధువుల రాకపోకలు, శుభవార్తలు, ఆహ్వానాలతో ఇల్లు సందడిగా వుంటుంది.
శుభకార్యాలు జరపటానికి అవసరమైన ధనం సులభంగా సమకూరుతుంది.
వీధికెదురుగా గేటు అమర్చుకోవటం మంచి ఫలితాలను ఇస్తుంది.
అయితే ఆగ్నేయమూల కొబ్బరి చెట్లు, ఎరుపుపూల చెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
































