సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. అక్టోబర్ 2 లోపు వాటిపై నిషేదం

ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో జరిగిన సర్క్యులర్ ఎకానమీపై ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.


నగరపాలక సంస్థలు, పంచాయతీలు కలిసికట్టుగా పని చేసి జీరో వేస్ట్ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మూలన, వనరుల పునర్వినియోగం, వ్యర్థాల నుంచి సంపద సృష్టి వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్టోబర్ 2 కల్లా నిషేధం..

ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను ప్రోత్సహించాలని, వాటి వినియోగాన్ని విస్తృతంగా విస్తరించాలని సూచించారు. అలానే ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ (RRR) సెంటర్ల ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, రీసైక్లింగ్, వ్యర్థాల వేరు చేయడంపై 90 రోజుల్లోగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు.

స్వచ్ఛత అవార్డులు..

అంతే కాకుండా వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ సేవలందిస్తున్న స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, అంగన్‌వాడీలు, ఎన్జీవోలకు వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛత అవార్డులు’ ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు.

వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీకి పెద్దపీట వేస్తోందని సీఎం స్పష్టం చేశారు. రెండు నెలల్లోగా తుది పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో విశాఖపట్నంలో 400 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నట్టు వివరించారు.

11 రంగాలు, 3 అదనపు శాఖలపై ప్రత్యేక దృష్టి

సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్రం గుర్తించిన 11 కీలక రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సీఎం చెప్పారు. వీటితో పాటు మరో 3 శాఖలపై కూడా ప్రత్యేక దృష్టితో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.