కోలీవుడ్ స్టార్ నటుడు ఆర్య (Aarya)కు ఐటీ శాఖ (Income Tax Department) అధికారులు షాకిచ్చారు. బుధవారం ఉదయం నుంచి చెన్నైలోని (Chennai) తన నివాసంతో పాటు ఆయనకు సంబంధమున్న వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ సోదాలు ముఖ్యంగా చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలైన అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ల్లో ఉన్న సీ షెల్ రెస్టారెంట్లపై జరుగుతున్నాయి. అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్యపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, సరైన పన్నులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్టు సమాచారం.
కాగా, సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్య, ఒక వ్యాపారవేత్తగా కూడా తన మార్క్ చూపించాడు. గతంలో సీ షెల్ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఈ రెస్టారెంట్లను కేరళకు చెందిన కున్హి మూసా అనే వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. ఈ దాడులపై స్పందించిన ఆర్య.. సీ షెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని స్థానిక మీడియాతో చెప్పారు. ఇక నటుడు ఆర్య తమిళ సినిమాలలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. గతంలో హీరో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనంతరం రాజారాణి సినిమాతో తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.
































