భారత్‌లో ఫాల్కన్‌ 2000 జెట్‌ విమానాల తయారీ

భారత్‌లో ‘ఫాల్కన్‌ 2000’ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ జెట్‌ల తయారీ నిమిత్తం ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కుదుర్చుకుంది.


అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే నిమిత్తం భారత్‌లో ఈ జెట్‌లను తయారు చేస్తారు. పారిస్‌ ఎయిర్‌ షోలో దసో ఏవియేషన్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఏరోస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఈ విషయాన్ని ప్రకటించాయి. ఇందుకోసం మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఫాల్కన్‌ 2000 విమానాల అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంటు కార్యకలాపాలు మొదలైతే అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్‌ తర్వాత బిజినెస్‌ జెట్స్‌ తయారు చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరుతుంది. ఫాల్కన్‌ 2000 జెట్స్‌ను ఫ్రాన్స్‌ వెలుపల తయారు చేయనుండటమూ ఇదే తొలిసారి.

దసో ఫాల్కన్‌ 2000 అనేది 2 ఇంజిన్లతో కూడిన విభిన్న బిజినెస్‌ జెట్‌. ఇందులో 8-10 మంది ప్రయాణించొచ్చు. ‘దసో ఏవియేషన్‌తో భాగస్వామ్యం రిలయన్స్‌ గ్రూపు చరిత్రలోనే కీలక మైలురాయి. అంతర్జాతీయంగా విమానాల తయారీ కేంద్రంగా భారత్‌ స్థానాన్ని బలోపేతం చేసేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. దేశ సాంకేతికత నైపుణ్యానికి, తయారీ సామర్థ్యానికి గర్వించదగ్గ ప్రతీకగా భారత తయారీ ఫాల్కన్‌ 2000 నిలుస్తుంద’ని రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.