SBI క్రెడిట్‌ కార్డు కొత్త రూల్‌.. జూలై 15 నుంచి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్‌ అమౌంట్‌ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది.


క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్‌ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్‌ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.

ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్‌ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.

ఏం మారిందంటే..
ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల కొత్త మినిమమ్‌ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్‌ను ఎస్‌బీఐ కార్డ్‌ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.

ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్‌తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.

యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దు
ఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.

పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి – ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి – చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.

మితిమీరిన వాడకం వద్దు – క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.

వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి – ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.

రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి – క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.

స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి – అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటిక​ప్పుడు పర్యవేక్షించండి.

కార్డుల సంఖ్యను తగ్గించుకోండి – ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.