కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పార్టీ అధ్యక్షుడిగా తమ పార్టీని సరైన దాడిలో నడిపించడంలో ఎన్నో విమర్శలు చవిచూసినా..అన్నింటిని తనదైన శైలిలో తిప్పికొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్న నేత రాహుల్.
ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో అందర్నీ ఆశ్చర్యపరిచేలా అమిత ప్రజాదరణ పొందడమే గాక తన పార్టీని అధికారంలోకి వచ్చేలా శతవిధాల కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన పుట్టినరోజు(జూన్ 19). ఈ రోజు రాహుల్ తన 55వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.
రాహుల్ గాంధీ జూన్ 19, 1970న న్యూఢిల్లీలో జన్మించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దంపతుల సంతానం. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన భారత్, విదేశాలలో విద్యను అభ్యసించారు. ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎం.ఫిల్. డిగ్రీని పొందారు.
ఇక ఆయన ఫిట్నెస్ దినచర్య పరంగా చాలామందికి స్ఫూర్తి. అంతేగాదు తన ఫిట్నెస్ గురించి 2023లో రాజస్థాన్‌లోని భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ట్రావెల్ అండ్ ఫుడ్ ఛానల్ కర్లీటేల్స్తో జరిగిన సంభాషణలో షేర్ చేసుకున్నారు కూడా. ఆ ఇంటర్వ్యూలో తన డైట్, వర్కౌట్ల గురించి మాట్లాడారు. తాను ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తానని, అలాగే అనారోగ్యం పాలుకాకుండా ఉండేలా మంచి ఆహారం తీసుకుంటానని చెప్పారు.
తన అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో కూడా ఈ విషయం చెప్పారు. తాను ఎప్పుడూ ఒకేవిధమైన వర్కౌట్లను చేస్తానని, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ చేయనని అన్నారు. ఇక రాహుల్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ అన్న విషయం తెలిసిందే. ఆయనకు డైవింగ్ కూడా తెలుసు. అంతేగాదు తాను చేపట్టిన భారత జోడో యాత్రలో సైతం క్రమం తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ తరగుతులు తీసుకునేవాడినని పలు సందర్భాల్లో చెప్పారు కూడా.
తీసుకునే ఆహారం..
డైట్ విషయంలో తాను కార్బోహైడ్రేట్లు అస్సలు తినని అననారు. తాను ఎక్కువుగా రోటీని ఇష్టపడతానని అన్నారు. తాను ఎక్కువగా మాంసహార ప్రియుడినని చెప్పారు. వంటకాల్లో ఎక్కువగా చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, సాదా ఆమ్లెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అయితే ప్రతి ఉదయం ఒక కప్పు కాఫీ మాత్రం తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పారు.
కాగా, గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజును పురస్కరించుకుని, పార్టీ ఢిల్లీ యూనిట్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ సంయుక్తంగా తల్కటోరా స్టేడియంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నాయి. ఇక ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి పలువురు ప్రముఖులు రాహుల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
































