టెక్ సిటీ బెంగుళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఆగ్నేయ బెంగళూరులోని ఎంఎన్ క్రెడెన్స్ ఫ్లోరా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో దిగ్భ్రాంతికరమైన దృశ్యం భయాందోళన కలిగిస్తోంది.
అపార్ట్‌మెంట్‌లో ఒక మురికి గుంటను కాంట్రాక్ట్ కూలీలు శుభ్రం చేస్తుండగా పుర్రెలు, ఎముకలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా వారంతా షాక్‌కు గురయ్యారు. దీంతో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంఛార్జ్‌కు సమాచారం అందించారు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అవశేషాలను పరిశీలిస్తున్నారు. మానవ అవశేషాలా? లేదంటే జంతువులవా? అని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 16న అపార్ట్‌మెంట్‌లోని కార్ పార్కింగ్ దగ్గర ఉన్న పెర్కోలేషన్ పిట్‌ను కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు. ఇంతలో వారికి భారీగా పుర్రెలు, ఎముకలు కనిపించాయి. దీంతో వారంతా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్ లాబొరేటరీకి పంపించారు. అస్థి పంజరాలు మానవులవా? జంతువులవా? రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని బేగూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలు వారంలోగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
దాదాపుగా ఈ అపార్ట్‌మెంట్ పదేళ్ల నుంచి ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో 45 ప్లాట్లు ఉన్నాయి. నీటి నిర్వహణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా అవశేషాలు బయటపడ్డాయి. అయితే ఈ అపార్ట్‌మెంట్ నిర్మించక ముందు ఇక్కడ స్మశానం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. స్మశానవాటికను ఆక్రమించి అపార్ట్‌మెంట్ కట్టినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే అస్థిపంజరాలు బయటపడినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయినా కూడా రిపోర్ట్ వచ్చేంత వరకు క్లారిటీ రాదని తెలిపారు. బేగూర్ పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 194(3)(iv) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో మొత్తం 16 గుంతలు ఉండగా.. ఒక గుంతలో ఈ అవశేషాలు బయటపడినట్లు పేర్కొన్నారు.
































