‘అనవసరంగా గొడవలు వద్దు’.. CM రేవంత్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్

బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..


గోదావరిలో పుష్పలంగా నీళ్లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రెండూ వాడుకోవచ్చు. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువున్నాయి. కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను ఏనాడూ అడ్డుచెప్పలేదు. తెలంగాణ పై భాగంలో ఉన్నది. కింద ఉన్న ఏపీ నీళ్లు వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు, అభ్యంతరాలు ఎందుకు అని అడిగారు. తెలంగాణలోనూ ప్రాజెక్టులు కట్టాలి.. ప్రజలు, రైతులు అందరూ బాగుండాలని కోరుకుంటాను.. అంతేకానీ ప్రజా ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయను అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు చంద్రబాబు సూచించారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం చేశారు.

కాగా, బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. నాడు కేసీఆర్, జగన్‌ కలిసి రాయలసీమకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.