ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల వెనుక ఉన్న బైబిల్ రహస్యాలు: యుద్ధాలకు బైబిల్ పేర్లు ఎందుకు ఉన్నాయి?

ఆపరేషన్ సింధూర్ – ఇటీవల మన దేశం పాకిస్తాన్ పై చేసిన దాడికి పెట్టిన పేరు. ఇందులో మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఆపరేషన్ కు పేరు పెట్టారు.


ఇది భారతీయులందరినీ ఆకర్షించింది. అదే రీతిలో ఇటీవలే ఇరాన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడికి ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టారు. అయితే ఇజ్రాయెల్ తన సైనిక ఆపరేషన్లకు పెట్టే పేర్లు అన్నీ బైబిల్ లోని పాత నిబంధన గ్రంధం (OLD TESTAMENT) లోని తీసుకున్నవే. అయితే ఈ ఆపరేషన్లన్నీ విజయాల వెనుక బైబిల్ రహస్యాలు దాగి ఉన్నాయన్న ప్రచారం పాశ్చాత్య దేశాల్లో సాగుతోంది. ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లు వారి సంస్కృతిని, వారి దేవుడిపై భక్తిని, వారి చరిత్రను ప్రతిబింబించే విధంగా ఎలా పెట్టారో తెలుసుకుందాం.

ఇజ్రాయెల్ తన సైనిక ఆపరేషన్లకు మత గ్రంధం నుంచి పేర్లు ఎందుకు పెడుతున్నారు?

ఇజ్రాయెల్ జాతీయత, వారి మత గుర్తింపు, యూదుల చరిత్ర, వారి సంస్కృతి, వారసత్వం, అక్కడి భూమితో వారికున్న అనుబంధం అంతా మత గ్రంథంతో పెనవేసుకుని ఉంటుంది. బైబిల్ క్రైస్తవులకు మత గ్రంథం అయినా, ఈ క్రైస్తవ్యం పుట్టింది, ప్రపంచానికి వ్యాపించింది ఇజ్రాయెల్ గడ్డ మీద నుంచే. యూదులు వాస్తవానికి క్రైస్తవ్యాన్ని అంగీకరించరు. కానీ క్రైస్తవులతో వారి అనుబంధం కీలకమైందని చెప్పాలి. యూదుల మత గ్రంథం అయిన తోరహ్ లో ఉండేవన్నీ, క్రైస్తవులు చదివే బైబిల్ లోని పాత నిబంధన గ్రంథంగా అంతర్భాగమై ఉంటుంది. దాదాపు యూదులు చదివే గ్రంథాన్ని పాత నిబంధనగా క్రైస్తవులు చదువుతారు. అయితే యూదుల మత గ్రంథం హెబ్రీ భాషలో ఉంటే, బైబిల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి తర్జుమా అయ్యింది. ఇలా ఇజ్రాయెల్ ప్రజల్లో మత గ్రంథం ఓ భాగం అని చెప్పాలి. వారి జాతీయత, వారి ఉనికి, వారి సంస్కృతి అంతా వారి మత గ్రంథం నుంచే సంగ్రహించారని చెప్పవచ్చు. అదే రీతిలో వారు చేసే యుద్ధాలు, సైనిక ఆపరేషన్లకు కూడా పెట్టే పేర్లు అన్నీ బైబిల్లో నుంచే కనిపిస్తాయి. అలాంటి ఆపరేషన్లు, వాటి పేర్లు, వాటి వెనుక ఉన్న బైబిల్ రహస్యాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇజ్రాయెల్ దృఢత్వాన్ని తెలిపేలా సైనిక ఆపరేషన్లకు బైబిల్ లోని పేర్లు

  1. ఆపరేషన్ రైజింగ్ లయన్ (Operation Rising Lion) – దీన్ని ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్కు పేరు. ఈ పేరు పెట్టడానికి బైబిల్లోని సంఖ్యా కాండం (Book of Numbers) 23:24 లో నుంచి తీసుకున్నారు. అందులో రాసిన వాక్యాలు: “ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును; అది సింహమువలె నిక్కి నిలుచును” అని రాసి ఉంటుంది. ఈ వాక్యాల ఆధారంగా ఇజ్రాయెల్ పాలకులు ఇరాన్ అణు కేంద్రాలపై చేసే ఆపరేషన్కు ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టారు. ఈ బైబిల్ వాక్యాలను యూదు ప్రజల శక్తిని, వారి సంకల్పానికి నిదర్శనంగా చెబుతారు.
  2. ఆపరేషన్ గిడియాన్స్ రథాలు (Operation Gideon’s Chariots – 2024/2025) – ఈ ఆపరేషన్ కూడా గాజాలో హమాస్ నుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించడానికి, హమాస్ను పూర్తిగా నిర్మూలించే ఆపరేషన్. 2024-2025 సంవత్సరాలలో జరుగుతున్న గ్రౌండ్ ఆపరేషన్కు ఆపరేషన్ గిడియన్స్ ఛారియట్స్ (రథాలు) అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడానికి ప్రేరణ బైబిల్లోని న్యాయాధిపతులు (Judges) 7-8 అధ్యాయాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇందులో చిన్న కథ ఉంటుంది. గిడియన్ అనే వ్యక్తి 300 సైనికులతో భారీ శత్రు సైన్యాన్ని ఓడిస్తాడు. ఇది పరిమిత వనరులతో, దేవుని శక్తి ద్వారా అసాధారణ విజయం సాధించగల సామర్థ్యానికి ప్రతీక. ఈ బైబిల్ స్టోరీ ప్రేరణగా ఇజ్రాయెలీయులను హమాస్ చెర నుండి విడిపించే ఆపరేషన్కు ఆపరేషన్ గిడియన్స్ ఛారియట్స్ అని పేరు పెట్టారు.
  3. ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్ (Operation Swords of Iron – 2023) – బైబిల్లో కత్తి అనే పదాన్ని యుద్ధానికి, న్యాయానికి, దేవుని శక్తికి ప్రతీకగా భావిస్తారు. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి ప్రతిగా గాజాలో ఆపరేషన్ ప్రారంభించింది. దానికి ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్ అనే పేరు పెట్టారు. ద్వితీయోపదేశకాండము (Deuteronomy) 33:29: “ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు; నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు” అని ఆ వాక్యం చెబుతుంది. ఆ స్ఫూర్తితో గాజా ఆపరేషన్కు ఆపరేషన్ స్వోర్డ్స్ ఆఫ్ ఐరన్ అనే పేరు పెట్టారు.
  4. ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ (Operation Protective Edge – 2014) – పాలస్తీనాలోని గాజాస్ట్రిప్ లో హమాస్కు వ్యతిరేకంగా 2014లో చేపట్టిన సైనిక ఆపరేషన్కు ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ అని పేరు పెట్టారు. దీని హీబ్రూ అసలు పేరు “త్సూక్ ఎయిటాన్” అంటే “బలమైన రాక్” లేదా “పటిష్టమైన కొండ” అని అర్థం. ఈ రెండు పదాలు బైబిల్లో తరుచూ కనిపిస్తాయి. కీర్తనలు (Psalm) 18:2 లో “యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు; నేను ఆశ్రయించియున్న నా దుర్గము” అని రాసి ఉంటుంది. దీంతో పాటు ద్వితీయోపదేశకాండము (Deuteronomy) 32:4 లో “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు” అని ఉంటుంది. ఇది రక్షణ, బలానికి సూచికగా ఇజ్రాయెల్ ప్రజలు గుర్తిస్తారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని హమాస్కు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్కు ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్ అని నామకరణం చేశారు.
  5. ఆపరేషన్ మోసెస్ (Operation Moses – 1984) – ఇథియోపియాలో అంతర్యుద్ధం, కరువు కారణంగా చాలా మంది యూదులు ఇబ్బందులు పడ్డారు. 1984 లో వారిని లా ఆఫ్ రిటర్న్ అనే చట్టం ప్రకారం, అంటే ప్రపంచంలో ఎక్కడ యూదులు ఉన్నా వారు ఇజ్రాయెల్కు తిరిగి వచ్చి ఇజ్రాయెల్ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఈ లా ప్రకారం ఇథియోపియాలో ఉన్న యూదులను సుడాన్ మీదుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం రహస్యంగా తరలించింది. దీనికి బైబిల్లోని నిర్గమకాండము (Book of Exodus), మోషే (మోసెస్) ఇజ్రాయెల్ ప్రజలను ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించి, వాగ్దాన భూమికి నడిపించిన కథకు ప్రేరణ. ఇలా ఇథియోపియా నుంచి వారిని ఇజ్రాయెల్కు తెచ్చే ఆపరేషన్కు ఆపరేషన్ మోసెస్ అని పేరు పెట్టారు.

ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక ఆపరేషన్లకు ఇలా బైబిల్ నుంచి పేర్లు పెట్టడం ఆనవాయితీ మాత్రమే కాదు; వారి దేవుడి పట్ల అచంచలమైన విశ్వాసానికి, వారి సంప్రదాయ, సంస్కృతులకు నిదర్శనం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.