ఎన్నికల సరళికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేసి తప్పుడు కథనాలు సృష్టించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ఆ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్‌లు, వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్‌లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సూచించింది. దీనికి సంబంధించి రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు మే 30న లేఖలు పంపగా.. ఆ విషయం తాజాగా బయటికొచ్చింది.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు దశల్లో చేపట్టే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సీసీటీవీ రికార్డింగ్, వెబ్‌కాస్టింగ్ విధానాలపై ఈసీ ఆ లేఖలో సూచనలు జారీ చేసింది. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన చట్టాల ప్రకారం.. ఈ రికార్డింగ్‌లు తప్పనిసరి కానప్పటికీ పారదర్శకత కోసం ఈసీ వీటిని ఓ సాధనంగా వినియోగిస్తోంది. అయితే, ఇటీవల ఈ రికార్డులను దుర్వినియోగం చేసి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులకు ఈసీ పలు సూచనలు చేసింది.
”ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ ఏ వ్యక్తి అయినా 45 రోజుల్లోపు సంబంధిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే వీలుంది. అందువల్ల పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్, ఫొటోగ్రఫీ డేటాను ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు భద్రపర్చాలి. ఆలోగా సంబంధిత నియోజకవర్గంలో ఓటర్ల తీర్పును సవాల్ చేస్తూ ఎలాంటి పిటిషన్ దాఖలు కాకపోతే ఆ రికార్డింగ్‌లను ధ్వంసం చేయొచ్చు” అని ఈసీ అందులో స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన రికార్డింగ్‌లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు గతేడాది డిసెంబరులో కేంద్ర చట్టంలో సవరణలు చేసింది. సీసీ కెమెరా, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డింగ్‌లను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఆంక్షలు తీసుకొచ్చింది.
































