కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్…రిటైర్డ్ ఉద్యోగులకు భారీగా పెరగనున్న పెన్షన్

 ఏడవ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియనున్న నేపథ్యంలో 8వ పే కమిషన్ పైన సర్వత్రా ఈ చర్చ నడుస్తోంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమలు చేస్తారు.


కానీ ఎనిమిదో వేతన సంఘం అమలుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. పాత వేతన సంఘం అమలు సమయాన్ని పరిశీలిస్తే, ఏడవ వేతన సంఘాన్ని 2014 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఇది 2016 జనవరి 1న అమలులోకి వచ్చింది. అంటే కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింన అనంతరం, మంత్రివర్గం నుండి ఆమోదం పొందిన తర్వాత, దానిని అమలు చేయడానికి దాదాపు ఏడాది కాలంపైగా పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2026 చివరి వరకు లేదా 2027 ప్రారంభం నాటికి కానీ కేంద్ర ప్రభుత్వానికి 8వ వేతన సంఘం సిఫార్సులు దక్కే అవకాశం లేదనే చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే 7వ వేతన సంఘం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించగా, కనీసం వేతనం రూ.7000 నుండి రూ. 18,000కి పెరిగింది. అదేవిధంగా, పెన్షన్ కూడా గణనీయంగా పెరిగింది. పెన్షన్ మొత్తం రూ. 3500 నుండి రూ. 9,000 కు పెరిగింది. అయితే, 8వ వేతన కమిషన్‌ విషయంలో ఫిట్‌మెంట్ 2.86 ఉండాలని ఉద్యోగులు పట్టు బడుతున్నారు. దీనివల్ల జీతాలు పెన్షన్లలో భారీగా పెరుగుదలకు దారితీయవచ్చు. 8వ వేతన సంఘం 2.86 వరకు ఫిట్‌మెంట్ కారకాన్ని అమలు చేస్తే లెవల్ వన్ ఉద్యోగులకు కనీసం వేతనం రూ. 18,000 నుండి రూ. 51,000 కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పెన్షనర్లకు కూడా ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అమలు చేసినట్లయితే కనీస పెన్షన్ రూ. 35,000 వరకూ పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

8వ వేతన సంఘం అధికారికంగా తన సిఫార్సులను విడుదల చేసిన తర్వాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రకటిస్తారు. ఎనిమిదవ వేతన సంఘం అమలుతో, ప్రభుత్వ వ్యయంలో భారీ పెరుగుదల ఉండవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందువల్ల, 8వ వేతన సంఘం ఈ చిక్కులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఏదైనా తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర సమీక్షను నిర్వహించే అవకాశ ఉన్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.