ఏపీలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మరో సూపర్ సిక్స్ హామీ అమలుకు సిద్దమవుతోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్న హామీని అమలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ కీలక సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో పథకం అమలుకు ముందే ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రాలకు విద్యుత్ బస్సులు సమకూర్చుకునేందుకు కేంద్రం సాయం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 నగరాల్లో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ఇవాళ సీఎస్ విజయానంద్ అధ్యక్షతన మరో ఆరుగురు సభ్యులతో కలిపి ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇంధన, మున్సిపల్, రవాణా, ఆర్ధిక, పరిశ్రమల శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కల్పించింది.
ఈ స్టీరింగ్ కమిటీ రాష్ట్రంలోని 11 నగరాల్లో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టే అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన 750 విద్యుత్ బస్సుల్ని కొనుగోలు చేసేందుకు ఈ కమిటీ ప్రతిపాదనలు చేయనుంది. వీటి ఆధారంగా కేంద్రం బస్సుల కేటాయింపుకు ఆమోద ముద్ర వేస్తుంది. అనంతరం ఈ బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయంతో కొనుగోలు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను ఆగస్టు 15 లోపు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
































