Inquiry Completed on Ration Cards : రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత ఆరు నెలల్లో రేషన్ తీసుకోని వారి వివరాలను అధికారులు పరిశీలించారు. ఈ మేరకు రేషన్ కార్డు లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులుగా లెక్క తేలింది. ఈ వివరాలను సివిల్ సప్లైయ్ డిపార్ట్మెంట్ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది. కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల లిస్ట్ నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ఇక నుంచి వారికి రేషన్ కోటా నిలిపి వేయనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి.
అనుమానాస్పద రేషన్ కార్డులపై : రేషన్ కార్డు లబ్ధిదారులకు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవడం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకోని వారిని అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వారి వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పౌర సరఫరాల శాఖ ఈ వివరాల్ని జిల్లా కలెక్టర్లకు పంపించి, మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా సమగ్ర విచారణ జరిపించింది. ఇందులో అర్హులు, అనర్హులను గుర్తించి ఆ వివరాల్ని సివిల్ సప్లైయ్ డిపార్ట్మెంట్కు పంపించగా, రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది.
వలసలు, రెండుచోట్ల పేర్లు : ఇదిలా ఉండగా అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60 శాతం మంది అనర్హులుగా తేలారు. ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు (మైగ్రేషన్), చనిపోయిన వారు (డెత్), రెండుచోట్ల రేషన్ కార్డుల్లో పేర్లున్న వారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పంపిన రిపోర్టులతో వారి పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అనర్హులుగా తేలిన వారు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో అధికంగా ఉన్నారు.
































