దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చిన వర్షాలు ఇప్పుడు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ క్రమంలో జూన్ 23 నుంచి 28 మధ్య పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ (IMD Alert) హెచ్చరించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
జూన్ 28 వరకు
ఈ వర్షాలు జూన్ 24 నుంచి ఢిల్లీ, NCR ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో జూన్ 23 నుంచి 25 వరకు జమ్మూ కశ్మీర్ లడఖ్ ప్రాంతాల్లో ఉండగా, పంజాబ్, హర్యానాలో జూన్ 23 నుంచి 25 వరకు వర్షాలు కురియనున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో జూన్ 24 నుంచి 25 వరకు ఉంటాయని అంచనా. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో జూన్ 23 నుంచి 26 వరకు వానలు ఉండగా, ఈస్ట్ రాజస్థాన్ ప్రాంతాల్లో జూన్ 23 నుంచి 28 వరకు వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా..
మరోవైపు రానున్న నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఐఎండీ ప్రజలను అప్రమత్తం చేసింది. తెలంగాణలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు (జూన్ 23న) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు సూచనలు..
జూన్ 23 నుంచి 28 వరకు మధ్య భారతదేశం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, విదర్భ, చత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా వానలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. స్థానిక అధికారుల సూచనలు పాటించి జాగ్రత్త వహించాలని కోరారు.
































