పూర్వం ప్రజలు అన్నం తినడం, కుటుంబంతో సమావేశమవడం, పంచాయితీ చర్చలు.. ఇలా అన్నీ నేలపై కూర్చునే చేసేవారు. అలా కూర్చోవడం, లేవడం ద్వారా శరీరం నిరంతరం కదిలేలా ఉండేది.
కానీ, కాలం మారింది. సౌకర్యాల పేరుతో మారిన జీవనశైలిలో నేలపై కూర్చోవడమే మానేశారు. పైగా ఇప్పుడు చిన్నవయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఎక్కువయ్యారు. దీంతో కొందరైతే కూర్చొని లేచే శక్తినే కోల్పోతున్నారు. ఇది చిన్న విషయం అనిపించొచ్చు కానీ.. ఇదే ఇప్పుడు మన మరణాన్ని అంచనా వేయగలదని తాజా అధ్యయనంలో తేలింది. ‘సిట్టింగ్-రైజింగ్ టెస్ట్ (Sitting-rising test)’ (SRT) అంటారు. కండరబలం, వాటి మృదుత్వం, సమతౌల్యత, శరీర కూర్పు తదితర సమాచారం ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారు.
బ్రెజిల్‌లోని పరిశోధకుల బృందం తాజాగా 46-75 మధ్య వయసున్న దాదాపు 4,300 మందిపై అధ్యయనం చేసింది. వీరికి 0 నుంచి 5 వరకు స్కోరును కేటాయించింది. నిల్చోవడానికి, కూర్చోవడానికి మోకాలిని గానీ, వేరేవారి సాయాన్ని గానీ తీసుకున్నవారి స్కోరు నుంచి ఒక్కో పాయింటును, కదలికల్లో స్థిరత్వం లేనివారి నుంచి 0.5 పాయింట్లను తగ్గించింది. ఇలా 12 ఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చింది. ఈ వ్యవధిలో 665 మరణాలు సంభవించాయి. తక్కువ ఎస్ఆర్టీ స్కోరుతో అధిక మరణ ప్రమాదం ఉంటుందని దీనిద్వారా పరిశోధకులు గుర్తించారు. వీరి మరణ రేటు 42%, అధిక స్కోరు నమోదైనవారి మరణరేటు 3.7% ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. రెండు గ్రూపుల్ని పోల్చిచూస్తే తక్కువ స్కోరు ఉన్నవారు గుండెజబ్బులతో మరణించే అవకాశం 500%, సహజ మరణం సంభవించే అవకాశం 300% ఎక్కువని నిపుణులు పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో సమాజంలో వేర్వేరు వర్గాలపై ఈ పరీక్ష చేసి చూశామని, ఇది అత్యంత సులభమైన, సంపూర్ణమైన పరీక్ష అని వివరించారు.
































