బీపీ రీడింగ్‌ ఎప్పుడు తీసుకోవాలి?

బీపీ-రక్తపోటు… హై అయినా, లో అయినా అది ఆందోళనకరమే. లో బీపీని మంచి ఆహారంతో సరిచేసుకోవచ్చు. హై బీపీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.


లేదంటే అది గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే, బీపీ పరీక్షించుకోవడానికి తగిన సమయమేంటో తెలుసుకుని ఉండాలి. వ్యాయామం, ఒత్తిడి, తీసుకునే ఆహారం, నీళ్లు తాగే విధానం (డీహైడ్రేషన్‌ బీపీపై ప్రభావం చూపుతుంది), శరీర భంగిమ మొదలైన వాటివల్ల రక్తపోటు (బీపీ) మారుతూ ఉంటుంది. వీటి కారణంగా మనకు తోచినప్పుడు బీపీ పరీక్షించుకుంటే సరైన ఫలితాలు కనిపించవు. దాదాపు కచ్చితమైన ఫలితాలు కనిపించాలంటే రోజులో ఒకే రకమైన పరిస్థితులు, స్థిరమైన సమయాల్లో బీపీ రీడింగ్‌ తీసుకోవాలి.

తొలి రీడింగ్‌

తొలి రక్తపోటు (బీపీ) రీడింగ్‌కు పొద్దున నిద్ర లేచిన అర్ధగంట తర్వాత సమయం సరైందని నిపుణుల మాట. అయితే, ఏమీ తినకూడదు. కాఫీ లాంటి ద్రవ పదార్థాలు తాగకూడదు. నీళ్లు ఫర్వాలేదు. ఇప్పుడే ఎందుకంటే… నిద్ర లేవగానే మీ శరీరం నిద్ర మత్తు నుంచి బయటపడటానికి చూస్తుంటుంది. కాబట్టి, నిద్ర లేచిన వెంబడే బీపీ రీడింగ్స్‌ సరిగ్గా రాకపోవచ్చు.

రాత్రి పడుకునే ముందు

రోజులో రెండోసారి బీపీ రీడింగ్‌ తీసుకోవడానికి నిద్రకు ముందు అనువైన సమయం. కాకపోతే రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకోవాలి. ఇది రోజులో మీ బీపీ ఎలా మారిందో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. మీ గుండె, రక్త నాళాల ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం ఇస్తుంది.

ఎంత తరచుగా?

ఇంటి దగ్గరే బీపీ చూసుకునేవాళ్లు రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం రెండుసార్లు రీడింగ్‌ తీసుకోవాలి. వేర్వేరు సమయాల్లో రీడింగ్‌ తీసుకోవడం వల్ల బీపీ కచ్చితత్వం తెలిసి వస్తుంది. ఇక ఒకేసారి రెండు రీడింగులు తీసుకోవాలనుకుంటే మొదటి దాని తర్వాత మూడు నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత రెండిటినీ నమోదు చేసుకోవాలి. రెండిటి మధ్య తేడా ఎక్కువగా ఉంటే మూడోది అవసరమవుతుంది. ఆ తర్వాత మూడిటి సగటు లెక్కించాలి. బీపీ మిషన్‌ ఒకేదానిని వాడాలి. శరీరం ఒకే భంగిమలో ఉండాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.