మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి..? ఇలా చెక్ చేసుకోండి

దేశంలో సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి. మోసగాళ్లు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని అమాయకుల పేరు మీద నకిలీ సిమ్ కార్డులను కొనుగోలు చేసి నేరాలకు పాల్పడుతున్నారు.

దీనిపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలు సిమ్ కార్డు వాడకాన్ని ట్రేస్ చేసుకునే ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. అదే సంచార్ సాథీ (Sanchar Saathi) పోర్టల్. దీని ద్వారా ఒక వ్యక్తి తమ పేరుపై ఎన్ని సిమ్ కార్డు రిజిస్ట్రేషన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో మీ పేరుతో జారీ అయిన సిమ్ కార్డులను చెక్ చేసుకొని, అనధికార రిజిస్ట్రేషన్లను బ్లాక్ చేయవచ్చు. తద్వారా మీ ఐడెంటిటీ దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడవచ్చు.


స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో సంచార్ సాథీ (https://sancharsaathi.gov.in/) పోర్టల్‌లోకి వెళ్లాలి.
హోమ్ పేజీ (Home Page)లోకి వెళ్లి సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ (Citizen Centric Service) అనే మెనూ బటన్‌పై క్లిక్ చేయాలి.
సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ సెక్షన్‌లోకి వెళ్లిన తర్వాత ‘Know Your Mobile Connections’ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. ఇది క్లిక్ చేశాక కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.

ఈ పేజీలో 10 అంకెల మొబైల్ నంబర్‌ ఎంటర్ చేయాలని చూపిస్తుంది.
మీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్న, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌, క్యాప్చా కోడ్ సబ్మిట్ చేశాక మీరిచ్చిన మొబైల్ నంబర్‌కి 6 డిజిట్ వన్ టైం పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.
ఈ ఓటీపీని అక్కడ ఉన్న ఓటీపీ ఫీల్డ్‌లో ఫిల్ చేయాలి.
ఓటీపీ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయ్యాక పోర్టల్‌ లాగిన్ అవుతుంది. ఇప్పుడు మీ పేరుపై ఎన్ని మొబైల్ నంబర్లు రిజిస్టర్ అయ్యాయో చూపించి వాటి వివరాలను సైతం డిస్‌ప్లే చేస్తుంది.

ఈ లిస్టులో మీకు అనుమానస్పదంగా కనిపించిన లేదా మీ ప్రమేయం లేకుండా రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నంబర్లను గుర్తించొచ్చు. ఈ అనధికార నంబర్లను డీయాక్టివేషన్ చేసుకునే ఆప్షన్ కూడా పోర్టల్‌లో ఉంది. మొబైల్ నంబర్ పక్కనే ఉన్న రిపోర్ట్ (Report) అనే బటన్‌పై క్లిక్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. దీంతో, మీ ఐడెంటిటీ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.

ఏంటీ సంచార్ సాథీ పోర్టల్?
దేశంలో మొబైల్ ఎకోసిస్టమ్‌ని మరింత భద్రంగా, పారదర్శకంగా నిర్వహించడానికి కేంద్రంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఈ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్‌ని తీసుకొచ్చింది. మొబైల్ యూజర్లకు అవగాహన కల్పించడంతో పాటు వారి భద్రతను మెరుగు పరచడమే లక్ష్యంగా దీనిని డిజైన్ చేసింది.

మొబైల్ డివైజ్‌లకు సంబంధించిన వివిధ సర్వీసులను ఈ పోర్టల్ అందిస్తుంది. కోల్పోయిన లేదా చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ కనెక్షన్లకు సంబంధించి మోసాలను గుర్తించడం, కోల్పోయిన ఫోన్లను రికవరీ చేయడంతో పాటు మొబైల్ వాడకానికి సంబంధించి పాటించాల్సిన మెలకువలు, టెలికాం, ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ, పొటెన్షియల్ రిస్క్‌లకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.